సిరికొండ, మార్చి 31: పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే ఇంతవరకు ఏ ఎంపీలు చేయలేని పనులు చేసి చూపిస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు చేసే అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పటిష్టంగా ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందన్నారు. ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ ఐదేండ్లలో జిల్లాకు చేసిన పని ఏం లేదని, ఆయనను కాకుండా మోదీని చూసి ఓటు వేయాలని అడుగుతున్నారని విమర్శించారు. జిల్లాకు చేసిన పనులను చూపించి ఓట్ల కోసం రావాలని సూచించారు.