కోరుట్ల, మార్చి 21: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని, తనను గెలిపిస్తే కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం కోరుట్ల, మెట్పల్లి మండలం వెల్లుల్లలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ తన అమ్మమ్మ ఊరు భీమారం మండలంలోని దేశాయిపేట అని, తనకు జగిత్యాల జిల్లాతో ఆత్మీయ అనుబంధం ఉన్నదన్నారు. గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉన్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, అది టీడీపీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు వెనుక సీఎం రేవంత్‌రెడ్డి, అమిత్‌షా, మోదీ హస్తం ఉందన్నారు. కాంగ్రెస్ వందరోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసానిచ్చారు. ఐదేండ్లు ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ ఏనాడూ ఏ ఒక్క ఊరికీ వచ్చిన పాపాన పోలేదన్నారు. పసుపుబోర్డు తీసుకువస్తానని గద్దెనెక్కిన ఆయన రైతులను మోసం చేశాడని దుయ్యబట్టారు. ప్రజల గుండెల్లో నిలిచిన కేసీఆర్ పేరును చెరిపివేయడం ఎవరితరమూ కాదన్నారు.