భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. తెలంగాణను ఆగం చేసేందుకు కుట్రలు పన్నుతున్నది. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నది. రెచ్చగొట్టడమే సిద్ధాంతంగా మార్చుకున్న కమలం పార్టీ భౌతిక దాడులకు తెగబడుతూ రౌడీ రాజకీయాలకు పాల్పడుతున్నది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితను టార్గెట్‌గా చేసుకున్న ఆ పార్టీ జాతీయ నాయకత్వం విష ప్రచారానికి తెర లేపింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా అలజడిని సృష్టిస్తూ ప్రజల మూడ్‌ను డైవర్ట్ చేసే ఎత్తుగడతో.. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారాలకు తెర లేపి జనాలను గందరగోళానికి గురి చేస్తున్నది. కాషాయ పార్టీ చేస్తున్న కషాయ రాజకీయాలపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.
బీజేపీ కుట్రలపై మండిపడుతున్న టీఆర్ఎస్ నేతలు మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మోదీ, బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.ఉన్నది లేనట్లు ప్రచారం చేయడం… లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించడంలో భారతీయ జనతా పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. సోషల్ మీడియాను వాడుకొని జనాలను అయోమయానికి గురి చేయడం, అబద్ధాలతో పూట గడపడమే పనిగా పెట్టుకున్నది కమలం పార్టీ. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అలజడిని సృష్టిస్తూ ప్రజల మూడ్‌ను డైవర్ట్ చేసే క్షుద్ర రాజకీయాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఇందుకు తెర వెనుక బీజేపీ జాతీయ నాయకత్వమే దర్శకత్వం వహిస్తూ నాటకాన్ని ఆడిస్తున్నది. రోజుకో విధంగా విష ప్రచారాన్ని తెర మీదికి తీసుకు వచ్చి పదేపదే వల్లించడం ద్వారా ప్రజల్లో అబద్ధాన్ని నిజం చేసే కుట్రకు పాల్పడుతున్నది. లేనిపోని సంఘటనలను అమాయకులకు అంటగట్టి పైశాచిక ఆనందాన్ని సైతం పొందుతున్నది. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలోనూ ఇదే నీతిని బీజేపీ అవలంబిస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నది. సోషల్ మీడియాలో విష ప్రచారాలకు తెరలేపి జనాలను గందరగోళానికి గురి చేస్తున్నది. కమలం పార్టీ చేస్తున్న కషాయ రాజకీయాలపై సామాన్య జనమంతా దుమ్మెత్తి పోస్తున్నది. భారతీయ జనతా పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
బట్ట కాల్చి మీద వెయ్యడమే బీజేపీ పని..
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ స్థానం ప్రశాంతతకు మారుపేరుగా నిలిచేది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం తొలి మహిళా ఎంపీగా రికార్డుకెక్కిన కల్వకుంట్ల కవిత 2014 నుంచి 2019 వరకు విశిష్టమైన సేవలందించారు. ఎంపీగా జాతీయ అంశాలపై దీటుగా స్పందించడం, అంతర్జాతీయ సెమినార్లలో వక్తగా పాల్గొని ఇందూరు ఘనతను చాటి చెప్పారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో అంశాల వారీగా కొట్లాడి అనేక విజయాలను సాధించారు. పెద్దపల్లి – నిజామాబాద్ రైల్వేలైన్ కవిత పోరాటంతోనే పూర్తయ్యింది. నిజామాబాద్ – హైదరాబాద్ మార్గంలోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి అంశానికి కవిత ఎంపీగా ఉన్నప్పుడే పరిష్కారం దొరికింది. పసుపు బోర్డుపై అలుపెరగని పోరాటం చేశారు. స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ ఆఫీస్ మంజూరును తిరస్కరించి రైతుల చిరకాల కోరిక కోసం కొట్లాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఎంపీగా విశేష సేవలకు గాను బీజేపీ ప్రభుత్వంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు. ఎమ్మెల్సీగానూ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో పెనుమార్పులకు నాంది పలకడం, స్థానిక ప్రజాప్రతినిధుల సమస్య పరిష్కారంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. డైనమిక్ పొలిటీషియన్‌గా ఎదుగుతున్న కవితను రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ శక్తులు కావాలనే కుట్రలకు తెగబడ్డాయి.
కమలం పార్టీ రౌడీ రాజకీయం..

ఢిల్లీ వేదికగా జరిగిన తంతును రాష్ట్రంలోని వ్యక్తులకు అంటగడుతూ పైశాచికత్వాన్ని పొందుతున్న బీజేపీ పార్టీ అంతకూ ఆగకుండా అలజడికి తెర లేపింది. ఉల్టా చోర్ కొత్వాల్‌కే డాంటే అన్నట్లుగా సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ గుండాలు దాడులకు తెగబడడం సర్వత్రా విస్మయానికి గురిచేసింది. కర్రలు, రాళ్లతో టీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేస్తూ ఎమ్మెల్సీ ఇంటిపైకి దూసుకుపోయి రణరంగాన్ని సృష్టించారు. ప్రశాంత వాతావరణంలో ఒక రకమైన అలజడిని, అశాంతిని క్రియేట్ చేయడం ద్వారా ప్రజల్లో ఏదో జరుగుతుందనే భావనను కల్పించడమే ధ్యేయంగా బీజేపీ కుట్రలకు దిగుతున్నది. హైదరాబాద్‌లో జరిగిన రౌడీ రాజకీయంపై టీఆర్ఎస్ శ్రేణులు దీటుగా స్పందించి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అనేక చోట్ల బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బాధ్యతగా మెదగాల్సింది పోయి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పించడంపై సామాన్య జనం దుమ్మెత్తి పోస్తున్నారు. అసత్య వార్తలకు, విద్వేషపూరిత కథనాలకు సామాజిక మాధ్యమాలు వేదికలవుతుండగా దీని వెనుక వెన్నుదన్నుగా భారతీయ జనతా పార్టీ తతంగాన్ని నడిపిస్తున్నట్లుగా ప్రజలంతా భావిస్తున్నారు.
రెచ్చగొట్టడమే బీజేపీ సిద్ధాంతం..
భారతీయ జనతా పార్టీ నిత్యం ప్రజలను రెచ్చగొట్టే పనిలోనే నిమగ్నమైంది. కులం, మతం, దేశభక్తి పేరిట క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ద్వారా రవ్వ గింజంత మేలు చేసేందుకు ముందుకు రాని బీజేపీ ఎంపీలు నిత్యం రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంలో మాత్రం టాప్‌లో ఉంటున్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంలో మచ్చుకూ సభలో కనిపించని బీజేపీ ప్రజాప్రతినిధులు… నిత్యం సోషల్ మీడియాలో మెరుస్తూ అవాస్తవాలను వెదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఇందుకు చెక్‌డ్యామ్ నిర్మాణాల్లో నిధుల విషయంపై వివాదం రాజేసి తోక ముడిచిన ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారమే నిదర్శనం. కేంద్ర నిధులతో నిర్మాణాలు చేపట్టినట్లు వీడియోలు పోస్టుచేసిన ధర్మపురి అర్వింద్‌కు ఆధారాలతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జవాబిచ్చారు. కేంద్రం నుంచి పైసా నిధులు లేవని తేలడంతో ఎంపీ అర్వింద్ మొఖం చాటేసి కనీసం వివరణ కూడా ఇవ్వలేక మిన్నకుండిపోయారు. నోటికొచ్చినట్లు వాగి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూసి బొక్కబోర్లా పడ్డాడు. అచ్చం ఇదే కోవలో ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ ద్వంద్వ నీతికి బీజేపీ యత్నిస్తుండగా ప్రజలంతా ఆ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు.
బీజేపీపై ఆగ్రహం

సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన కూతురు ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, డిచ్పల్లి, ఇందల్వాయి మండల కేంద్రాల్లో మంగళవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరోసారి దుష్ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.