బాన్సువాడ, సెప్టెంబర్ 5: బీఆర్ఎస్ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బాన్సువాడ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. నియోజకవర్గంలోని వర్ని, బాన్సువాడ, కోటగిరి, పొతంగల్ తదితర మండలాల నుంచి బీజేపీ,కాంగ్రెస్ పార్టీకి చెందిన వందలాది మంది నాయకులు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు.
కేటీఆర్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాబోవు రోజుల్లో ఉప ఎన్నికలు వస్తాయని, గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాన్సువాడ ప్రాంత అభివృద్ధి, ప్రజలు, రైతు సంక్షేమం కోసం అమలుచేసిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో గులాబీ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
రానున్న 15 రోజుల్లో బాన్సువాడ కు తాను వస్తానని, అక్కడి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చేసిన ద్రోహాన్ని వివరిస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ నార్ల రత్నకుమార్, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యెలమంచిలి శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్‌రావు, సామాజిక కార్యకర్త హాకీం, సొసైటీ వైస్ చైర్మన్ గజేందర్, మాజీ సర్పంచులు పద్మ మొగులయ్య, గులపల్లి మొగులయ్య, బంజా గంగారాం, కురలేపు నగేశ్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌రెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధికార దాహంతోనే పార్టీ మారిన పోచారం
అధికార దాహంతోనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరాడని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కన్న తల్లిలాంటి పార్టీని మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌తోనే ఆయనకు ఎన్నడూ లేనంతగా కీర్తి వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే పదవుల కోసం వెంటనే పార్టీ మారారని విమర్శించారు.
పోచారం పార్టీ మారినా బాన్సువాడ నాయకులు మేమంతా మీ వెంటే ఉంటామంటూ కేటీఆర్ వెంట నడిచేందుకు నడుం బిగించడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్‌ను మోసం చేసిన పోచారం శ్రీనివాసరెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్లో ఆయనతో పనిచేసిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లక, మనసు చంపుకొని ఉండలేక మళ్లీ గులాబీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.