న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 : సిట్రినీ పరిశోధనా సంస్థ ప్రచురించిన ఒక నివేదిక దేశంలోని ఐటీ రంగంలో కలకలం రేపింది. ఆ రిపోర్ట్ దెబ్బకు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) భయంతో స్టాక్మార్కెట్లో ఈక్విటీల అమ్మకాలు రికార్డు స్థాయిలో చోటుచేసుకున్నాయి. ఒక్క మంగళవారం నాడే భారతీయ టెక్ కంపెనీల నుంచి దాదాపు రూ.10 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. ఆంథ్రోపిక్ క్లాడ్ కోడ్‌తోపాటు సిట్రినీ నివేదికలే ఈ పరిణామాలకు కారణమని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ది 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్’ శీర్షికతో ప్రచురితమైన ఆ నివేదిక భారత ఐటీ రంగం అత్యంత వేగంగా కుప్పకూలనున్నట్టు అంచనా వేసింది.
ఏఐ ఆటోమేషన్ కారణంగా 2028 నాటికి దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతుందని, దేశంలో ఆర్థిక అస్థిరత్వం ఏర్పడుతుందని పేర్కొంది. ముఖ్యంగా భారతీయ టెక్ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలకు ముప్పు తప్పదని హెచ్చరించింది. వీటి బిజినెస్ మాడల్స్ ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా ధ్వంసమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఏటా 200 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు చేసిన భారతీయ ఐటీ రంగం.. ఆయా సంస్థలు తక్కువ ఖర్చుతో వచ్చే ఏఐ కోడింగ్ ఏజెంట్లను ఉపయోగించడం ప్రారంభించడంతో ఒక్కసారిగా కుదేలయ్యిందని ఎత్తిచూపింది.
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు ఇప్పటికే 2027 నాటికి చేయాల్సిన ఎగుమతి కాంట్రాక్ట్‌లను కోల్పోతున్నాయని తెలిపింది. ఏఐ ఎంతో మెరుగుపడటమే కాకుండా చౌకగా లభిస్తున్నదని, దీంతో కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తూ.. ఆ సొమ్ముతో మరింత ఏఐ సామర్థ్యాన్ని కొనుగోలు చేస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఈ ప్రక్రియ కారణంగా మరింతమంది ఉద్యోగులు కోల్పోతున్నారని పేర్కొన్నది. మరోవైపు ఏఐలో కీలకంగా ఉన్న ఎన్విడియా, టీఎస్ఎం వంటి సంస్థలు లాభాలు గడిస్తున్నాయని వివరించింది.