Inter Exams | భువనగిరి కలెక్టరేట్, మార్చి 4 : ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా నేటి నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేసి మాట్లాడారు. ప్రతీ పరీక్ష కేంద్రం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విద్యార్ధులు అరగంట ముందే పరీక్షా కేంద్రాల కు చేరుకోవాలని సూచించారు.
పరీక్ష కేంద్రాలకు సెల్ ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలు, 12,558 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యార్ధులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాయాలన్నారు. 29 పరీక్షా కేంద్రాలలో ప్రథమ సంవత్సరం 6208, ద్వితీయ సంవత్సరం 6350, మొత్తం 12,558 విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకు 29 చీఫ్ సూపరెండెంట్లు, 29 శాఖల అధికారులు, ప్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్ లను నియమించడం జరిగిందన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు సమయానుకూలంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని, నిరంతర విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరేలా చర్యలు చేపట్టాలని, పోస్టల్ అధికారులు ప్రశ్నాపత్రాలను జాగ్రత్తగా తరలించాలన్నారు.
పరీక్షలు ప్రారంభం అయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాలలో అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష వ్రాసే సమయంలో అరగంట కొకసారి బెల్ మోగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు, పోలీస్ బందోబస్తు, తదితర ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను నియమిస్తూ ఫస్ట్ ఎయిడ్ కిట్ తో అందుబాటులో ఉండాలన్నారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఏర్పాటు చేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఇంటర్మీడియట్ విద్యాధికారి, రమణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.