ఎల్లారెడ్డి, డిసెంబర్ 9 : రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిని గుండెలకు హత్తుకున్నట్టే…నేడు భారత రాష్ట్ర సమితిని తెలంగాణ ప్రజలు తమ శ్వాసగా భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పార్టీ పేరు మార్పుపై నిర్ణయం ప్రకటించగానే మారుమూల పల్లె మొదలు పట్నం వరకు ప్రజల్లో ఆనందం వెల్లువెత్తింది. రెండు దశాబ్దాల క్రితం 2001లో పసికూనగా పుట్టి నేడు దేశ వ్యాప్తంగా ప్రజల ఆమోదానికి వెళ్తున్న బీఆర్ఎస్కు రాబోయే రోజుల్లో పట్టం కట్టడం ఖాయమైంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతోప్రజల మనసు దోచుకున్న టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మార్చడం దేశ చరిత్రను మార్చనున్న కేసీఆర్ ఆలోచనకు ఇది మొదటి అడుగని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
విజన్‌కు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న కేసీఆర్ దూరదృష్టి ఇకపై దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఇక రాచబాటేనని పలువురు అంటున్నారు. ఉద్యమంలో సైతం వెనకడుగు వేయని పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెనుమార్పు కోసం మడమతిప్పని బాట ఎంచుకున్నదని, మతతత్వ, కుల రాజకీయాలకు అతీతంగా పేద ప్రజల క్షేమం కోసం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తుందని పార్టీ వర్గాలతో పాటు ప్రజలు సైతం నమ్మడం విశేషం. కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ వేడుకలు జరపడమే దీనికి నిదర్శనం.
దశాబ్దాల కల సాకారం చేసుకునేందుకు 2001లో ప్రారంభమైన టీఆర్ఎస్ జైత్ర యాత్ర నేడు దేశ సమగ్రతను, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్గా పోరాటం ప్రారంభించింది. ఉద్యమంలో 14 సంవత్సరాల పాటు పని చేసిన వీరులు దేశ క్షేమం కోసం తమ నాయకుడి అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమని ప్రకటించడంతో దేశ రాజకీయాల్లో త్వరలోనే పెనుమార్పులు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. కేవలం దేవుడి పేరు చెప్పి ఓట్ల పంటను పండించుకుంటున్న మత చాందసవాదులకు కళ్లెం వేయడానికి కేసీఆర్ లాంటి మొండి నాయకుడు రావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. దేశ సంపదను కొందరి చేతుల్లోకి మళ్లించి పబ్బం గడుపుకోవాలని పగటి కలలు కంటున్నవారి ఆటలు ఇక సాగవని, ఇకపై ప్రజల కోసం పనిచేసే ప్రజాస్వామ్య నాయకులకు పట్టం లభిస్తుందనే వాదన వినిపిస్తోంది.
టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారడంతో కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు. ప్రతి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో పటాకులు కాల్చి తమ పార్టీ ఇకపై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. పలు ప్రాంతాల్లో మిఠాయిలు తినిపించుకున్నారు. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
సువిశాల భారత దేశం ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ మతాలు, కులాలు అనేవి ఉండరాదు. మనమంతా ఒకే కులం…ఒకే మతం అంటూ ఉండాలి. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి అవసరం. టీఆర్ఎస్ నేటి నుంచి బీఆర్ఎస్గా ఉన్నతమైన స్థానానికి వెళ్లింది. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుందని ప్రజలకు నమ్మకం కలుగుతున్నది. మనమంతా ఆయనకు అండగా నిలవాలి…నిలిచి గెలవాలి.
-మధుకర్, విశ్రాంత అధ్యాపకుడు, ఎల్లారెడ్డి.
దేశానికి యువకులే ప్రధాన ఆధారం. యువకులు పెడదారి పడితే అది దేశానికి చివరి రోజులు అవుతాయి. అందుకే మతాలు, కులాలు అంటూ కలహాలకు తావు ఇవ్వరాదు. అందుకే టీఆర్ఎస్ పార్టీ ఇకపై దేశ రాజకీయాల్లో పెను మార్పునకు నాందికానున్నది. ఇప్పటికే మన రాష్ట్రంలో రైతులు, ప్రజల కష్టనష్టాల్లో అండగా ఉంటున్నందున దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇటువైపు చూస్తున్నారు.
-సాయిలు, జప్తి జానకం పల్లి.
నేను నలభై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నది. రైతులకు అవసరమైన కరెంటు ఇస్తున్నది, మందు సంచులకు ఇబ్బంది లేదు. ఎవరైనా చనిపోతే రైతు బీమా ఇస్తున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా అధికారంలోకి వస్తే నాలాంటి లక్షలాది మంది రైతులకు న్యాయం జరుగుతది.
-యాదయ్య, రైతు, మాచాపూర్.