కామారెడ్డి, డిసెంబర్ 23 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలేదని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులకు రూ. 4వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూనియన్ ఆధ్వర్యంలో సీఎస్ఐ ప్రాంగణంలో సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే , బీడీ కార్మికులకు ఇస్తున్న జీవన భృతి పెన్షన్ రూ. 2,016 నుంచి రూ. నాలుగువేలకు పెంచి ఇస్తామని, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న కార్మికులకు కూడా ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతోపాటు ప్యాకర్లు, నెలసరి జీతాల ఉద్యోగులందరికీ చేయూత పథకం ద్వారా పెన్షన్ అమలుచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటి, కామారెడ్డి జిల్లా బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రకాశ్, బాలరాజు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సురేశ్, నాయకులు సాయాగౌడ్, సాయికుమార్, మురళి, గంగారాం, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.