మోర్తాడ్, ఆగస్టు 2: ఎలాంటి షరతులు లేకుండా తమకు రూ.4,016 పింఛన్ ఇవ్వాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఎంఎల్, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మోర్తాడ్ తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ డివిజన్ కార్యదర్శి దేవరాం, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా బీడీ కార్మికులందరికీ కటాఫ్డేట్తో సంబంధం లేకుండా రూ.4,016 జీవనభృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో లక్షలమంది బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమను నాశనం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్లు తీసుకువచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు.
బహుళజాతి కంపెనీలకు సబ్సిడీలు ఇస్తూ బీడీ పరిశ్రమపై పన్నులు పెంచి బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి కుట్రచేశారని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు సత్తెక్క, ఆనంద్, బాలకిషన్, సారాసురేశ్, కిషన్, అశోక్, బీడీ కార్మికులు పాల్గొన్నారు.