డిచ్పల్లి, అక్టోబర్ 28: తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసిన పోలీసులను సస్పెండ్ చేయడం సరికాదని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ పోరాడుతామని డిచ్పల్లి ఏడో బెటాలియన్ కానిస్టేబుళ్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పోలీసు విధానం అమలుచేయాలని, సస్పెండ్ చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ర్యాలీ నిర్వహించారు.
అనంతరం పరిపాలనా భవనం వద్దకు చేరుకుని ఇన్చార్జి కమాండెంట్ ఎంఐ సురేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు మాట్లాడుతూ.. తమ సమస్యలపై కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తే వారి భర్తలను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ బెటాలియన్లలో సస్పెండ్‌కు గురైన 39 మంది కానిస్టేబుళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.