నిజాంసాగర్/ పెద్దకొడప్గల్, నవంబర్ 14: నాలుగైదు రోజులుగా చలి విపరీతంగా పెడుతున్నది. శీతల గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. భానుడు ఉదయించినా.. చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటల వరకు వాతావరణం చల్లగా ఉంటున్నది. చలికాలంలో వసతి గృహం విద్యార్థులకు ఉదయమే స్నానం చేయడం కష్టంగా మారుతున్నది. వేడినీళ్లు అందుబాటులో లేకపోవడంతో చల్లని నీటితోనే స్నానం చేయాల్సి వస్తున్నది. వసతి గృహాల్లో గ్రీజర్లు, సోలార్ ప్లాంట్లు పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులు సూర్యోదయానికి ముందే చల్లని నీటితో జలకాలాడాల్సి వస్తున్నది. జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని వసతి గృహాల్లో ఉంటున్న దాదాపు అందరూ విద్యార్థులు చల్లని నీటితో స్నానం చేయలేక నానా అవస్థలు పడుతున్నారు.
మరోవైపు వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. ఇంటిని మరిపించేలా వసతులు ఉన్నాయని అధికారులు, నాయకులు అంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. హాస్టళ్లలో గ్రీజర్లు పనిచేయకపోయినా.. వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. కనీస మరమ్మతులు కూడా చేయించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గజగజ వణుకుతూ స్నానం చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. కనీస మరమ్మతులు చేయిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు.
జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న వసతి గృహాలతోపాటు గురుకుల పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గురుకుల పాఠశాలలో సుమారు 480 మంది విద్యార్థులు ఉండగా.. అందరూ చన్నీటి స్నానాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎస్సీ వసతి గృహం, బీసీ హాస్టల్లో సైతం ఇదే పరిస్థితి ఉన్నది. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో 130 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే శుక్రవారం వసతి గృహాన్ని పరిశీలించగా.. ఉదయాన్నే చల్లని నీటితో స్నానం చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. బోరు మోటరును ఆన్ చేసి అక్కడ ఉన్న కుండీలో స్నానం చేస్తూ కనిపించారు. సోలార్ ప్లాంట్ పనిచేయకపోవడంతో దానిని కనీసం రిపేరు చేయించడం లేదు. ఇక్కడ హాస్టల్లో నిద్రించేందుకు మం చాలు కూడా లేవు. దీంతో విద్యార్థులు నేలపైనే పడుకుంటున్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని బీసీ వసతి గృహాన్ని పరిశీలించగా.. అక్కడ కూడా విద్యార్థులు చన్నీళ్లతో స్నానం చేస్తూ కనిపించారు. చల్లని నీటితో స్నానం చేయడంతో విద్యార్థులు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కొందరు చల్లగా ఉదయమే స్నానం చేయడం ఇష్టం లేక మధ్యాహ్నం, సాయంత్రం వేళలో స్నానం చేస్తున్నారు. ఇప్పటికైనా స్నానం చేసేందుకు వేడినీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.