బాల్కొండ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో ట్రాక్టర్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 9వ తేదీన జరిగిన ఈ చోరీకి సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు ఒక కొనుగోలుదారుడిని అరెస్టు చేసినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా బాల్కొండ పోలీస్ స్టేషన్లో సీఐ మాట్లాడుతూ.. నాగపూర్ గ్రామానికి చెందిన ఎంబరి మహేశ్‌కు చెందిన ట్రాక్టర్, ట్రాలీని ఈ నెల 9వ తేదీన ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు అందిందని తెలిపారు. మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని పేర్కొన్నారు. ఈ క్రమంలో బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో ట్రాక్టర్ ట్రాలీ అమ్మకానికి బేరసారాలు జరుపుతుండటంతో వెళ్లి పట్టుకున్నామని చెప్పారు. నిందితులు చాకలి రాజు, మందుల అరవింద్, తుమ్మల రవి, విఠల్ మోహన్‌ను అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల నుంచి ట్రాక్టర్ ట్రాలీ, బైక్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.