ఖలీల్‌వాడి, డిసెంబర్ 20: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలి పోతాడని, కేటీఆర్‌ను అరెస్టు చేసి శునకానందం పొందాలని చూస్తున్నాడన్నారు. తప్పుడు కేసులతో అరెస్టు చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. ఏడాది పాలనతో కాంగ్రెస్ పతనం మొదలైందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచాలనే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణకు కేటీఆర్ కృషి చేశారన్నారు. ప్రపంచంలోనే పేరొందిన ఈ రేసింగ్‌ను తెలంగాణకు తీసుకురావడం ద్వారా ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించడంతో పాటు హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని చెప్పారు. గతంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన లండన్, బ్రెజిల్, మాస్కో వంటి నగరాల సరసన హైదరాబాద్ నిలువడానికి కేటీఆర్ కృషియే కారణమని చెప్పారు. ఈ రేసింగ్‌తో నిర్వాహకుల అంచనా ప్రకారం రూ .750 కోట్ల వ్యాపారం జరిగిందన్నారు.
ఫార్ముల ఈ రేసింగ్ నిర్వహణ ఒప్పందం ప్రకారమే జరిగిందని, ఇందులో ఎలాంటి అవినీతి లేదని బాజిరెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం రేసింగ్ జరిగి ఉంటే రాష్ర్టానికి లాభాలు వచ్చేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫార్ములా ఈ రేసింగ్‌ను రద్దు చేసిందన్నారు. పైగా ఇందులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రూ.55 కోట్లు అధికారికంగా ఇచ్చారని చెప్పారు. ఈ రేసింగ్‌కు సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని, కానీ ఏదోరంగా కేటీఆర్‌ను జైల్లో వేయాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నాడని ఆరోపించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. హైడ్రా వంటి వాటితో కాంగ్రెస్ పరువు పోయిందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్‌పై కేసులు పెట్టారని విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. అబద్ధాలతోనే పాలిస్తున్నాడన్నారు. హామీలు అమలుచేయకుండా పిచ్చి పనులు చేస్తున్నారని, రాష్ర్టాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉండేదని, కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రం పరువు తీస్తున్నారని విమర్శించారు. అధికారం ఉంది కదా అని కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని, ఇదంతా వినాశనానికేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హితవు పలికారు. జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు సిర్ప రాజు, శేఖర్, సత్యప్రకాశ్, సుజిత్‌సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.