డిచ్పల్లి, ఆగస్టు 15: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని, దానిని వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. డిచ్పల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణకు మాజీ ఆర్టీసీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు తమ సమస్యలను బాజిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బాజిరెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆటోవాలాలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆటోను నడిపి అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ బాధ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.