హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : అడవులను రక్షించడానికి ఏర్పాటు చేసిన అధికారులను కొడతాం.. చంపుతాం అంటే కుదరదని హైకోర్టు గురువారం హెచ్చరించింది. అటవీ భూముల రక్షణలో రాజీప్రసక్తే లేదని స్పష్టంచేసింది. అకడే నివసిస్తున్న గిరిజనులైనా చెట్లను కొట్టడానికి అనుమతించలేమని తేల్చిచెప్పింది. అసలు సిసలైన గిరిజనులకు అడవి అంటే దేవత వంటిదని, దానికి ఎప్పుడూ హాని తలపెట్టరని పేర్కొంది. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వారికి తగిన భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కంపగూడెం, జానకీపురం గ్రామాలకు చెందిన సుమారు 62 మంది గిరిజనుల భూమికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ వీరభద్రం అనే వ్యక్తి కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్, ఎస్పీ, అటవీశాఖాధికారులు ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. అటవీశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది పూర్ణచందర్రావు కౌంటర్ దాఖలు చేశారు. అందులో అటవీ శాఖాధికారులపై దాడులు జరుగుతున్నాయని, ఇదే జిల్లాలోని ఎర్రబోడు సమీపంలో ఫారెస్ట్ రేంజ్ అధికారిని హత్య చేశారని, నిందితులకు జీవితఖైదు కూడా పడిందని వివరించారు. ఈ వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి ఆందోళన వ్యక్తంచేస్తూ అధికారులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. రెవెన్యూ అధికారులకు అధికారం లేకపోయినా అటవీ భూముల్లో పట్టాలు జారీ చేస్తున్నారని చెప్పారు. రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన భూముల్లో అనుమతుల్లేకుండా చెట్ల నరికివేత సహా ఎలాంటి కార్యకలాపాలకు అనుమతించరాదని స్పష్టంచేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుష్ డైరెక్టర్ సూచనల మేరకు హైకోర్టు ఆవరణలోని హోమియోపతి డిస్పెన్సరీలో ఉచిత హోమియో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రక్త పరీక్షలు నిర్వహించి, ఉచితంగా హోమియోపతి మందులు పంపి ణీ చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ వీ రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ తదితరులు శిబిరాన్ని సందర్శించి వైద్యసేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జనరల్ గోవర్ధన్‌రెడ్డి, రిజిస్ట్రార్లు శ్రీధర్‌రావు, రమేశ్, రాజగోపాల్, కిరణ్‌కుమార్, వైద్యులు మాధవి, జ్యోతి, జవహర్ అహ్మద్‌తోపాటు డిస్పెన్సరీ సిబ్బంది పాల్గొన్నారు.