ఆసియా క్రీడల్లో శతక పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ స్వర్ణాల వేటలో వెనుకంజలో ఉన్నా.. వెండి వెలుగులతో సత్తా చాటుతోంది. రోషిబినా దేవి రజతం గెలిచి వరుసగా మూడో ఎడిషన్‌లో పతకం సాధించిన భారత తొలి వుషు ప్లేయర్‌గా రికార్డు సృష్టించగా.. అథ్లెటిక్స్ 4X400 మీటర్ల మిక్స్డ్ రిలే జట్టు కూడా వెండి పతకంతో మెరిసింది. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సీమా కుమారి, షూటింగ్ మిక్స్డ్ స్కీట్ జట్టు, రోయింగ్ ద్వయం సత్నామ్ సింగ్-సల్మాన్ ఖాన్ కంచు మోత మోగించగా.. పిస్టల్ షూటర్లు మరోసారి తేలిపోయారు. భారత్ నెగ్గిన మొత్తం పతకాల సంఖ్య 17కు చేరినా అందులో పసిడి ఒక్కటే ఉండటం గమనార్హం!

చివరి నిమిషాల్లో టీమ్ కాంబినేషన్స్‌లో మార్పులుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత రోయింగ్ బృందానికి సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ ఊరటనిచ్చింది. పురుషుల డబుల్స్ స్కల్లో కాంస్యం రాబ్టటింది. ఫైనల్లో ఈ ద్వయం 6:13.25 నిమిషాల టైమింగ్‌తో మూడో స్థానం సాధించింది. పోటీకి కేవలం ఐదు రోజుల ముందే తాము కలిసి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించామని సత్నామ్ తెలిపాడు.

నగోయా (జపాన్) : సెలెక్షన్ వివాదాలు, ఒత్తిళ్లను తట్టుకుని నిలిచిన భారత వుషు స్టార్ రోషిబినా దేవి ఆసియా గేమ్స్‌లో అదరగొట్టింది. ప్రతిష్టాత్మక క్రీడల్లో అరుదైన హ్యాట్రిక్ సాధించింది. వుషు మహిళల 60 కేజీల సండా విభాగంలో రజతం అందుకుంది. స్వర్ణంపై ఆశలు రేపిన 25 ఏండ్ల ఈ మణిపూర్ అమ్మాయి గురువారం జరిగిన ఫైనల్లో 0-2తో చైనాకు చెందిన షియావోయు జంగ్ చేతిలో ఓడిపోయి వెండితో తిరిగొచ్చింది. అయినా ఈ క్రీడల చరిత్రలో వరుసగా మూడు ఎడిషన్లలో (2018లో కాంస్యం, 2022లో రజతం, 2026లో రజతం) పతకాలు సాధించిన భారత తొలి వుషు క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. అథ్లెటిక్స్ పోటీలు మొదలైన తొలి రోజే భారత్ డబుల్ ధమాకా మోగించింది.

4×400 మీటర్ల మిక్స్డ్ రిలే జట్టు రజతం అందుకోగా.. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సీమా కుమారి కాంస్యంతో మెరిసింది. ఉత్కంఠగా సాగిన రిలే ఫైనల్లో పూవమ్మ రాజు, విశాల్ తెన్నారసు, విత్య రామ్రాజ్, మను టీఎస్‌తో కూడిన భారత జట్టు 3 నిమిషాల 14.46 సెకండ్ల టైమింగ్‌తో రెండో స్థానం సాధించింది. గత ఎడిషన్‌లో నెగ్గిన రజతాన్ని నిలబెట్టుకుంది. ఫైనల్ లెగ్‌లో అద్భుతంగా పరుగెత్తిన విత్య జట్టుకు పతకం ఖాయం చేసింది. బహ్రెయిన్ 3 నిమిషాల 12.87 సెకండ్లతో గేమ్స్ రికార్డు బ్రేక్ చేస్తూ స్వర్ణం అందుకుంది. అంతకుముందు మహిళల 10 వేల మీటర్ల ఈవెంట్లో సీమ 32 నిమిషాల 50.05 సెకండ్ల టైమింగ్‌తో మూడో స్థానంతో కాంస్యం గెలిచింది. ఈ పోటీలో 16 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు పతకం అందించింది. మెన్స్ 100 మీటర్ల క్వాలిఫికేషన్ రేసులో గుర్వీందర్ సింగ్ (2వ స్థానంతో), అనిమేష్ (3వ స్థానం) సెమీఫైనల్స్‌కు అర్హత సాధించారు.
షూటింగ్ స్కీట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అనంత్ జీత్ సింగ్ నరుకా-పరినాజ్ ధలివాల్ ద్వయం భారత్‌కు తొలి పతకం అందించి రికార్డు సృష్టించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ ఎలిమినేషన్లో భారత జోడీ ఆరు సిరీస్‌ల తర్వాత 44 హిట్స్‌తో కొరియా జట్టుతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. అయితే క్వాలిఫికేషన్ రౌండ్లో భారత్ 138 స్కోరు మాత్రమే చేయగా.. 143 స్కోరు చేసిన కొరియా ముందంజ వేసింది. ఫలితంగా భారత్ మూడో స్థానంతో కాంస్యంతో పోరు ముగించింది.

చైనా 52 హిట్స్‌తో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసి స్వర్ణం నెగ్గగా.. కొరియా (51) రజతం అందుకుంది. కాగా, ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత అబ్బాయిలూ నిరాశపరిచారు. పురుషుల 10మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో కమల్జీత్, ఆకాశ్ భరద్వాజ్, బాలకృష్ణ క్వాలిఫికేషన్ రౌండ్లో వరుసగా 9, 11, 35వ స్థానాలతో సరిపెట్టి కనీసం ఫైనల్‌కు కూడా క్వాలిఫై అవ్వలేకపోయారు. టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఈ తయ్రం 1727 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయింది.
హాకీలో బరిలోకి దిగితే భారీ విజయాలు నమోదుచేస్తున్న భారత జట్టు.. పూల్ స్టేజ్‌లో భాగంగా ఆడిన తమ మూడో మ్యాచ్‌లో 8-2తో కొరియాపై గెలిచింది. దిల్‌ప్రీత్ సింగ్ (26, 32వ నిమిషాల్లో), అభిషేక్ (15, 35) చెరో రెండు గోల్స్ చేయగా శైలేంద్ర (4), సుఖ్జీత్ (10), హర్మన్‌ప్రీత్ సింగ్ (11), రాజిందర్ సింగ్ (60) తలా ఒక గోల్ కొట్టారు. తదుపరి పోరులో హర్మన్‌ప్రీత్ సేన జపాన్‌తో తలపడనుంది.

స్కాష్‌లో యువ సంచలనం అనాహత్ సింగ్‌తో పాటు తన్వి ఖన్నా, అభయ్ సింగ్, వీర్ చోత్రాని, జ్యోష్న చిన్నప్పవెలవన్ సెంథిల్ కుమార్ జోడీ క్వార్టర్స్ చేరింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అనాహత్ 3-0తో వై ఇన్ యోంగ్ (సింగపూర్)ను 19 నిమిషాల్లోనే మట్టికరిపించింది. మరో పోరులో తన్వి 3-1 తో వై యిన్- యాన్ యోంగ్ (సింగపూర్)ను ఓడించింది. క్వార్టర్స్‌లో అనాహత్, తన్వి తలపడనున్నారు. మెన్స్ సింగిల్స్‌లో అభయ్, చోత్రానితో పాటు జ్యోష్న-సెంథిల్ జోడీ తమ ప్రత్యర్థులను ఓడించి ముందంజ వేశారు.

ఆసియాడ్ ముంగిట రోషిబినా అనూహ్య పరిణామాలను ఎదుర్కొంది. జూన్‌లో శ్రీనగర్‌లో జరిగిన ట్రయల్స్‌లో ఆమెపై దివ్యాంశి చౌదరి విజయం సాధించింది. కానీ, దివ్యాంశి మోకాలి గాయానికి గురికావడంతో భారత వుషు సమాఖ్య మణిపూర్ అమ్మాయినే జట్టులోకి తీసుకుంది. అయితే రోషిబినా ఒత్తిడి తెచ్చి తనను తప్పించిందని దివ్యాంశి సోషల్ మీడియా వేదికగా ఆరోపించడం సంచలనం సృష్టించింది. తీవ్ర ప్రతికూలతల నడుమ బరిలోకి దిగినా పట్టుదలతో మూడో పతకం నెగ్గిన రోషిబినా తన ఎంపికకు న్యాయం చేసింది. సెలెక్షన్ వివాదం తన వల్ల జరగలేదని, తనను ఎంపిక చేయడం పూర్తిగా ఫెడరేషన్ నిర్ణయమని ఆమె చెప్పింది. ‘ఫెడరేషన్ తీసుకున్నది మంచి నిర్ణయమే. ఎవరైనా నాపై ప్రతికూలత చూపించినా నేను పట్టించుకోను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బలంగా నిలబడాలి. అనవసర విషయాలను పక్కనబెట్టి ఆత్మవిశ్వాసం కోల్పోకపోవడమే ముఖ్యం. పోటీలకు బయలుదేరే కొద్ది రోజుల ముందే నాకు జట్టులో చోటు దక్కినట్లు తెలిసింది. ప్రాక్టీస్‌కు తగినంత సమయం లభించి ఉంటే ఇంకా మెరుగైన ప్రదర్శన ఇచ్చేదాన్ని’ అని పేర్కొంది. ఇక, గత ఎడిషన్ ఆసియాడ్ సమయంలో స్వరాష్ట్రం మణిపూర్‌లో జరిగిన హింసాకాండ వల్ల తాను తీవ్ర మానసిక వేదనను అనుభవించానని, కానీ ఈసారి సాధించిన రజతం తనను మరింత దృఢంగా మార్చిందని రోషిబినా తెలిపింది.
కబడ్డీలో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలో దిగి ఓటమన్నదే లేకుండా ఆడుతున్న పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్స్ చేరుకున్నాయి. గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‌లలో భారత పురుషుల జట్టు 37-21తో చైనీస్ తైపీని ఓడించగా అమ్మాయిలు 50-25తో జపాన్ను చిత్తుచేసి దేశానికి మరో రెండు పతకాలను ఖాయం చేశారు. ఇక, బాక్సింగ్‌లో పర్వీన్ (మహిళల 65 కేజీ) వాకోవర్‌తో ముందంజ వేయగా సాక్షి చౌదరి (51 కేజీ.) పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. సాక్షి 2-3తో బల్కిబెకొవ (కజకిస్థాన్) చేతిలో పోరాడి ఓడింది. మెన్స్ 70 కేజీల కేటగిరీలో సుమిత్ గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో మెడల్‌పై ఆశలు రేపిన భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్.. 8 మంది పాల్గొన్న వాల్ట్ ఫైనల్‌ను ఆరో స్థానంతో ముగించి నిరాశపరిచింది. ఫెన్సింగ్‌లో పతకం లేకుండానే భారత పోరాటం ముగిసింది.