వర్ని (రుద్రూర్), అక్టోబర్ 17: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రె స్ ప్రభుత్వం నాటకం ఆడుతున్నదని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి నటించాడు తప్ప మరేంలేదన్నారు. శుక్రవారం ఆయన వర్ని మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ పిలుపు మేరకు నేడు బీసీ సంఘాల బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలుచేయాలని బాజిరెడ్డి డిమాండ్ చేశారు. అందరితో కలిసి ఢిల్లీకి వెళ్దామని అఖిలపక్షంతో చెప్పిన సీఎం.. కేవలం కాంగ్రెస్ పార్టీ వారే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారని తెలిపారు. నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే అందరి మద్దతులో పార్లమెంట్‌కు వెళ్లేవారని, కానీ ఏదో సాధించామంటూ ప్రజలను మభ్యపెట్టి ప్రధానమంత్రి తమకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక జీవో జారీ చేసి స్థానిక ఎన్నికల నిర్వహిస్తామని నిర్ణయించగా కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. ఇదంతా జరగదని తెలిసీకూడా ముఖ్యమంత్రి ఒక సీన్ క్రియేట్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తెలుసుకున్న బీసీ సంఘాల నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వద్దకు వచ్చి మద్దతు కావాలని కోరారని తెలిపారు. బీసీలకు అండగా ఉంటామని, బీసీలకు న్యాయం జరగాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని కేటీఆర్ అన్నారని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే ప్రధాని వద్దకు వెళ్లి అడిగితే రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంటుందన్నారు. బీజేపీకి చెందిన ఎంపీలు 9మంది ఉన్నారని, ఆ పార్టీలో బీసీ నాయకులతో సమస్య ఎదురవుతుందని గ్రహించి రిజర్వేషన్ అమలుచేసే అవకాశం ఉందన్నారు. ప్రధానితో కలిసి బీసీ రిజర్వేషన్లను అమలుచేయిస్తే తప్ప స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదన్నారు. నేటి బీసీబంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ బంద్‌లో కాంగ్రెస్ నాయకులు పాల్గొంటామని చెప్పడం విచిత్రమని పేర్కొన్నారు. అన్యాయం చేసిన పార్టీ నాయకులే బంద్‌లో పాల్గొనడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు యలమంచలి శ్రీనివాస్, కోటగిరి ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, వర్ని, రుద్రూర్, కోటగిరి, చందూర్ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.