బాన్సువాడ, ఆగస్టు 18: పాలన చేతకాని దద్దమ్మ రేవంత్‌రెడ్డి.. మాటలు తప్ప చేతల్లో చూపడం లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు సహా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి వచ్చిందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా డిపాజిట్లు గల్లంతవడం ఖాయమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం, అక్కడ బీఆర్ఎస్ గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బాన్సువాడలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకుడు షేక్ జుబేర్‌తో కలిసి బాజిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్లపై అవసరమైతే కేంద్రంతో పోరాడతానని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు తీసుకెళ్లలేదని బాజిరెడ్డి ప్రశ్నించారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లకుండా సొంత పార్టీ నేతలను ఢిల్లీకి తీసుకుపోయిండన్నారు. అక్కడ నిర్వహించిన ధర్నాకు సొంత పార్టీ నేతలే రాలేదని, జనం ఎక్కడ ఛీకొడతారో అనే భయంతో ప్రధానిని విమర్శించి వచ్చారన్నారు. రేవంత్‌రెడ్డికి సబ్జెక్ట్ లేదని, రిజర్వేషన్లను ఏవిధంగా అమలు చేయించాలో తెలియదని, సిగ్గులేకుండా గాలి మాటలతో కాలం గడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే ఎవరి స్థాయిలో వాళ్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవాళ్లన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బాజిరెడ్డి విమర్శించారు. కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలనే అరకొరగా కొనసాగిస్తున్నారన్నారు. ఏ ఒక్క పథకాన్ని వంద శాతం అమలు చేయడం లేదన్న బాజిరెడ్డి.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవన్నారు. రెండేండ్ల పాలనలోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ఏకైకా పార్టీ కాంగ్రెస్సేనని తెలిపారు. అధికార పార్టీనేతలకు, మంత్రులకు పొంతన కుదరడం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఎక్కడ తమపై వేటు పడుతుందోనన్న భయం పట్టుకుందని అన్నారు. ఇటీవలే కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్యే పదవులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని, రానున్న రోజుల్లో పది మంది ఫిరాయిం పు ఎమ్మెల్యేలపైనా వేటు పడుతుందని చెప్పారు. తాము ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నామని, తాము సానుభూతిపరులం తప్పితే పార్టీలో చేరలేదని డొంక తిరుగుడుగా చెబుతున్నారని ఎద్దే వా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ మళ్లీ రావాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పోచారం శ్రీనివాసరెడ్డి కొంచెమన్న పెద్దరికం లేకుండా ఈ వయస్సులో పార్టీ మారడం ఏమిటని బాజిరెడ్డి ప్రశ్నించారు. బాన్సువాడలో ప్యారచూట్ నేతలు తిరుగుతున్నారని అంటున్నారని, వారే ని న్ను మట్టి కరిపిస్తారని హెచ్చరించారు. ప్యారచూట్ గురించి వాళ్లకు తెలియదని, టెర్రరిస్టులను హతమర్చాడనికి సైనికులు ప్యారచూట్లోనే వెళ్తారన్నారు.