ఖలీల్‌వాడి, అక్టోబర్ 26 : సీఎం కేసీఆర్ ప్రతి రైతునూ ఆదుకున్న వ్యక్తి అని, అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలుచేస్తున్నారని మాజీ స్పీకర్, రాజ్యసభ సభ్యుడు కేఆర్. సురేశ్‌రెడ్డి అన్నారు. మోపాల్ మండలంలోని బోర్గాం(పీ) శివారులో ఉన్న మోటాడిరెడ్డి ఫంక్షన్‌హాలులో నుడా చైర్మన్ ఈగ సంజీవ్‌రెడ్డి అధ్యక్షతన రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా రెడ్డిబంధు ఆత్మీయ సమ్మేళనాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. తనకు బాజిరెడ్డి గోవర్ధన్‌తో 40 సంవత్సరాలుగా మంచి స్నేహం ఉన్నదని, మా ఇద్దరి ఆలోచనా విధానం దాదాపు ఒకే విధంగా ఉంటుందని అన్నారు. తమకు ప్రజల సంక్షేమమే తప్ప మరో ధ్యాస లేదని అన్నారు. తెలంగాణ వచ్చాక గ్రామాల్లోని రోడ్లకు మహర్దశ వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో నేతలు మాటలు చెప్పారే తప్ప.. పనులు చేయలేదని, సీఎం కేసీఆర్ చెప్పకున్నా అమలుచేసి చూపారని అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఇతర ఏ రాష్ట్రంలో అమలుకావడంలేదన్నారు.
పదేండ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో.. ఇప్పడు ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలని సూచించారు. గతంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం రూ.50 వేల కోట్లు ఉండేదని, ప్రస్తుతం రూ.2 లక్షల 50 వేల కోట్లకు చేరిందని.. ఇది కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమైందని తెలిపారు. పసుపు రైతులకు న్యాయం జరిగేలా బోర్డును ఏర్పాటు చేస్తానని గత ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ మాట ఇచ్చి మోసం చేశారని అన్నారు.
రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గ ప్రజల సహకారంతో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించానని అన్నారు. రైతులు 200 ఎకరాలు త్యాగం చేయడం ద్వారా 80 వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని.. ఈవిషయమై రైతులు ఆలోచించాలని అన్నారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు ప్రాజెక్టును రద్దు చేస్తామని రైతులకు మాయమాటలు చెబుతున్నారని, వాటిని నమ్మవద్దని స్పష్టం చేశారు. తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ.. రెడ్డి కులస్తులు దాదాపు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని, ఇతరులకు పని కల్పించే గొప్ప మనసున్న వ్యక్తులని అన్నారు.
నుడా చైర్మన్ ఈగ సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ& బాజిరెడ్డి గోవర్ధన్‌ను 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బాజిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తన పక్కన కూర్చుండపెట్టుకుంటామని మంత్రి కేటీఆర్ తనతో అన్నారని తెలిపారు. నియోజకవర్గంలో రెడ్డి హాస్టల్ ఏర్పాటు కోసం స్థలంతో పాటు కోటి రూపాయలు మంజూరు చేయాలని కోరగా.. బాజిరెడ్డి సానుకూలంగా స్పందించారు.
బాడ్సి గ్రామానికి చెందిన అల్లూరి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్‌కు రూ. 10 వేలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబరి మోహన్, రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు.