ధర్పల్లి, నవంబర్ 13 : రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయారో ప్రజలు గ్రహించారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కోసమే ఎదురుచూస్తున్నారని, రాబోయే రోజులు మనవేనని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ పట్టిష్టత కోసం నిజాయితీగా, ధైర్యంగా పాటుపడాలని, తాను అండగా ఉంటానని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలకేంద్రానికి గురువారం వచ్చిన ఆయన.. స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులను అధికార బలంతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని అన్నారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండడంతోపాటు పార్టీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా భయపడవద్దని, రాష్ట్ర ప్రజలు కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుదామని, వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పీసు రాజ్‌పాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ మాజిద్, నాయకులు భూమేశ్, శంకర్‌నాయక్, నజీర్, సబావత్ శ్రీనివాస్‌నాయక్, గంగారెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్, నవంబర్ 13 : జూబ్ల్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన మాగంటి సునీత విజయం ఖాయమని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లోని నివాసంలో మల్కాపూర్ తండాతో పాటు పలు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాజిరెడ్డిని గురువారం మర్యాదపూరకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకతను మూట గట్టుకోవడంలో సీఎం రేవంత్‌రెడ్డి ముందున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బాజిరెడ్డిని కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు మీసాల మధుకర్‌రావు, గంగారాంనాయక్, అంబ్రీయా నాయక్, మోతీనాయక్, సామ్యానాయక్, మాన్సింగ్, గోవింద్, రవీందర్, గోపాల్‌నాయక్ ఉన్నారు.