సారంగాపూర్, అక్టోబర్ 14: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీఆర్ఎస్ సత్తా చాటాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉన్నదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని తన నివాసంలో రూరల్ మండల బీఆర్ఎస్ నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో విసుగు చెంది ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పదేండ్ల కాలంలో సుపరిపాలన అందించిన తెలంగాణ తొలిసీఎం కేసీఆర్‌ను తలుచుకుంటూ మళ్లీ సారే రావలనే ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారని వివరించారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పకడ్బందీ ప్రణాళికా వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ తరుపున టికెట్ కేటాయించిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యతను మరువకూడదని సూచించారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల విజయం కోసం అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలను వివరించారు. అనంతరం బాజిరెడ్డిని బీఆర్ఎస్ నాయకులు శాలువాతో సత్కరించారు. సమావేశంలో బీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్‌రావు, సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షుడు అశోక్‌కుమార్, నాయకులు లక్ష్మణరావు, గోపాల్, జమీర్‌ఖాన్, రాంగోపాల్‌రెడ్డి, వసంతరావు, అనూష లక్ష్మణ్, నవీన్, శ్రీనివాసరెడ్డి, రాజిరెడ్డి, యూత్ నాయకులు పాల్గొన్నారు.