మోర్తాడ్, జూలై 2: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీలోకి వరద పెరిగింది. బుధవారం ప్రాజెక్ట్‌లోకి 6,713 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తు తం ప్రాజెక్ట్‌లో 1065.30 అడుగుల (16.405టీఎంసీలు) నీటినిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 635 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా, కాకతీయ కాలువకు 100, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 304 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.
లింగంపేట, జూలై 2: కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మండల కేంద్రంలోని పెద్దవాగు జలకళ సంతరించుకున్నది. వర్షాకాలం ఆరంభం నుంచి భారీ వర్షాలు కురవకపోవడంతో పెద్దవాగు అడుగంటిపోగా మంగళవారం కురిసిన వర్షానికి నీటి ప్రవాహం మొదలైంది. మండలానికి ఎగువన ఉన్న గాంధారి మండలంలోని ఆయా గ్రామాల్లో వర్షం కురవడంతో బుధవారం ఉదయం పెద్దవాగులో నీటి ఉధృతి పెరిగింది. దీంతో రైతులకు పంటల సాగుపై ఆశలు చిగురించాయి.
పెద్దవాగుపై ఆధారపడి వేలాది ఎకరాల్లో పంటలను సాగు చేస్తుంటారు. మండల కేంద్రంలోని ఊర చెరువుతోపాటు రెండు కుంటలకు జీవనాధారం పెద్దవాగు. మత్తడి కాలువ ఆయకట్టుతోపాటు ఊర చెరువుకు కింద వందలాది ఎకరాలు పంటలను సాగు చేస్తుంటారు. పెద్దవాగులో వరద నాగారం వద్ద ఉన్న చెక్‌డ్యాం దాటి మత్తడి దుంకి లింగంపేట వరకు చేరుకున్నది.