ధాన్యం కొనుగోలు విషయంలో అడుగడుగునా పేచీకి దిగుతున్న కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ జిల్లా రైస్‌మిల్లర్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కేంద్రం ఆధీనంలో ఉన్న భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ పలువురు మిల్లర్లు ఆవేదన వెలిబుచ్చారు. అన్లోడింగ్ చేయకుండా రోజుల తరబడి లారీలను నిలుపుతున్నారని, గన్నీ సంచులను కారణంగా చూపుతూ తిప్పిపంపుతున్నారని వారు ఆందోళన వ్యక్తంచేశారు. నిజామాబాద్ కలెక్టరేట్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ యంత్రాంగంతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై రైస్‌మిల్లర్లు గొంతువిప్పారు. ఈ సందర్భంగా కేంద్రం తీరు సరిగా లేదని పేర్కొన్న మంత్రి.. తెలంగాణ ధాన్యం విషయంలో కావాలనే ఎఫ్‌సీఐ ద్వారా కుట్రలకు పాల్పడుతున్నదని విమర్శించారు.
నిజామాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అడుగడుగునా పేచీకి దిగుతున్న కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ జిల్లా రైస్‌మిల్లర్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కేంద్రం ఆధీనంలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ పలువురు మిల్లర్లు ఆవేదన వెలిబుచ్చారు. బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై రైస్‌మిల్లర్లు గొంతువిప్పారు. మర ఆడించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాములకు తీసుకుపోయిన తర్వాత అన్లోడింగ్ చేయడంలో ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నారని మిల్లర్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. లారీలను రోజులకొద్దీ వెయిటింగ్లో ఉంచడం ద్వారా అదనపు ఖర్చు పెరుగుతున్నదని తెలిపారు. ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరుతో నష్టాలపాలవుతున్నామని వ్యాపారులు వాపోయారు. గన్నీ సంచుల విషయంలోనూ కొత్త నిబంధనలను తెరపైకి తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
కొత్త గన్నీ సంచుల్లోనే బియ్యం ఇవ్వాలని చెబుతున్నారని, రిపేరు చేసిన గన్నీ సంచులను పంపిస్తే లారీలను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నా రు. మరోవైపు బియ్యం గింజ రంగు మారిందని లో డ్ మొత్తాన్ని తిరస్కరించిన సంఘటనలను స్వయంగా ఎదుర్కొంటున్నామంటూ మిల్లర్లు తమ బాధలను మంత్రితో పంచుకున్నారు. మిల్లర్ల ఆవేదనపై స్పందించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. కేంద్ర సర్కారు కావాలనే కుట్రలు చేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ వివక్షాపూరిత ధోరణిని ప్రజలంతా గమనించాలని కోరారు. బియ్యం తరలింపులో జాప్యం చేసి గోదాములు ఖాళీ చేయకుండా తెలంగాణ సర్కారును బదనాం చేయాలని కేంద్రం కుట్ర చేస్తున్నదని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం తీరుకు నిరసనగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలన్నీ తీర్మానాలు చేసి పంపినప్పటికీ మోదీలో చలనం లేకపోవడం దురదృష్టకరమన్నారు. వడ్ల కొనుగోళ్ల వివక్షపై గల్లీ నుంచి ఢిల్లీదాకా నిరసన తెలిపామన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును చూసే వరి వేయొద్దని యాసంగికి ముందు సీఎం కేసీఆర్ చెబితే బీజేపీ వాళ్లు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారన్నారు. ఇప్పుడు ముఖాలు చూపించడం లేదని మండిపడ్డారు. కేంద్రం తన బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలిగితే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ధాన్యం సేకరించాలని నిర్ణయించిందని చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లను యజ్ఞంలా నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని రైతు లు తీసుకు రావాలని కోరారు. నాణ్యమైన వడ్లను తీసుకొస్తే తరుగు తీయకుండా మిల్లర్లు తప్పక నిబంధనలు పాటించాలంటూ సమీక్షలో మంత్రి పేర్కొన్నారు. తరుగు పేరిట వేధిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. తుక్కు తేవొద్దని రైతులను చేతు లు జోడించి వేడుకుంటున్నట్లుగా మంత్రి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 3.46 లక్షల ఎకరాల్లో వరి వేయగా ఇందులో దొడ్డురకం 1.24లక్షల ఎకరాల్లో, 2.25లక్షల ఎకరాల్లో సన్న రకాలున్నాయన్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో 13లక్షల గన్నీ బ్యాగులుండగా మిగిలిన కోటిన్నర గన్నీ బ్యాగుల విషయంలో చొరవ తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. కొనుగోళ్ల ప్రక్రియకు 12వేల మంది హమాలీలు అవసరమవుతారని, ప్రస్తుతం 3వేల మంది అందుబాటులో ఉండగా మిగిలిన వారిని త్వరలోనే సమకూర్చుకోవాలని మంత్రి సూచించారు.
– దాదన్నగారి విఠల్‌రావు, జడ్పీ చైర్మన్
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రైతులంతా ఆగ్రహంగా ఉన్నారని జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు అన్నారు. ధాన్యం సేకరించాలని సీఎం నిర్ణయం తీసుకోవడంతో రైతులకు ఉపశమనం కలిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించి గౌరవాన్ని పెంపొందించుకోవాలని, అలాంటిది అడుగడుగునా వివక్ష చూపుతూ రాష్ర్టాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం హేయమైందన్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
రైతులపై మోదీ ప్రభుత్వం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా కలిసి ఢిల్లీలో నిరసన తెలిపినప్పటికీ కేంద్రంలో చలనం లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులను ఆదుకునేందుకు ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధం కావడం గొప్ప విషయమన్నారు. కేంద్రం నుంచి వస్తున్న ఆదేశాలను అమలుచేస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాస్తా కొంతకాలంగా నాన్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియాగా మారుతున్నదని దుయ్యబట్టారు. రైల్వే వ్యాగన్లు ఇవ్వకుండా, ఎఫ్‌సీఐ గోడౌన్ల నుంచి బియ్యం తరలించకుండా ఇబ్బందులు పెడుతూ కేంద్రం నాటకాలు ఆడుతున్నదన్నారు.