భీమ్‌గల్,జూలై 20: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై ఇసుక మాఫియా దాడులకు పాల్పడిన ఘటన భీమ్‌గల్ మండలం బెజ్జోరాలో చోటుచేసుకున్నది. శుక్రవారం అర్ధరాత్రి బెజ్జోరా కప్పలవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న సమయంలో అదే రోడ్డు గుండా ముచ్కూర్ నుంచి భీమ్‌గల్‌కు బీఆర్ఎస్ యూత్ నాయకులు కర్నే మహేందర్, అనిల్, నరేశ్ వస్తున్నారు.
ఇసుక తరలిస్తున్న మద్దూరి భాస్కర్, శ్రీరాం రవి, రాజులకు చెందిన ఇసుక ట్రాక్టర్లను అడ్డుకొని ప్రశ్నించడంతో కొద్దిసేపు ఘర్షణ నెలకొన్నది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో మద్దూరి భాస్కర్ పక్కనే ఉన్న పెద్ద కర్రను తీసుకొని కొట్టేందుకు ప్రయత్నించగా కర్నే మహేందర్ ప్రతిఘటించడంతో భాస్కర్ కిందపడిపోయాడు. కిందపడ్డ భాస్కర్ అక్కడే ఉన్న రాయితో మహేందర్ తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో మహేందర్‌ను వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. డాక్టర్ వెంట నే చికిత్స చేసి తలకు ఆరు కుట్లు వేశాడని మహేందర్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మండలంలో ఇసుక అక్రమ రవాణా ముప్పై లారీలు, మూడు వందల ట్రాక్టర్లుగా కొనసాగుతున్నది. ఈ అక్రమ రవాణాను అడ్డుకుంటే దాడులకు కూడా వెనుకాడడం లేదు. తమకు ప్రభుత్వ పెద్దల అండ ఉందంటూ బహిరంగంగానే చెబుతున్నారంటే ఎంతలా విచ్చలవిడిగా కొనసాగుతున్నదో అర్థమవుతున్నది. ఈ వ్యవహారంపై మండలస్థాయి నుంచి మొదలుకొని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదు. మొక్కుబడిగా కొన్ని రోజుల వరకు బ్రేక్ ఇస్తున్నారే తప్పా.. అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
ఇసుక అక్రమ రవాణాతో రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల్లో నష్టం వాటిల్లుతున్నది. ఈ దందాను మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖలు అడ్డుకోకపోవడం శాఖల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. తమ పరిధిలోకి ఇసుక రాదం టూ తప్పించుకుంటున్నారని, దీంతో ఇసుక మాఫియాకు మరింత బలం చేకూరుస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అక్రమ రవాణాను అడ్డుకునే వారిపై దాడులకు తెగబడుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా మైనింగ్ అధికారులను వివరణ కోరగా తమ పరిధిలోకి రాదని సమాధానం ఇవ్వడం గమనార్హం.
ఇసుక మాఫియా దాడిలో గాయపడిన కర్నే మహేందర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడిచేసిన మద్దూరి భాస్కర్, శ్రీరాం రవి, రాజులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొన్న కర్నే మహేందర్‌ను బెజ్జోరా గ్రామానికి చెందిన మద్దూరి భాస్కర్, శ్రీరాం రవి, పిట్ల రాజు దాడికి పాల్పడ్డారని, మహేందర్‌ను చంపాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న బండరాయితో కొట్టడంతో తీవ్రగాయాలపాలైయ్యాడని ఎస్సై హరిబాబు తెలిపారు. మహేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
దాడులను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కర్నే మహేందర్‌కు అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిసినా ఆ పార్టీ నేతలు అడ్డుకోవడం లేదంటే వారి కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనడానికి నిదర్శనం. ప్రజాపాలన అంటే ప్రజలపై దాడులా.
– దొన్కంటి నర్సయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే ఇంతలా రెచ్చిపోతే.. మిగతా నాలుగున్నర ఏండ్లు ఎలా పాలిస్తారో ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రజాపాలన అంటే అడ్డుచెప్పిన వారిపై దాడులేనా?
– ఆర్మూర్ మహేశ్, మాజీ ఎంపీపీ