ఆర్మూర్‌టౌన్/ ఖలీల్‌వాడి, మే 4: ఖాళీ ఖజానా అంటూ పదేపదే పేద ఏడ్పులు ఏడ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీల కోసం అందగత్తెలకు రెడ్ కార్పెట్ పరుస్తూ దేశానికి అన్నం పెట్టే అన్నదాతల చేతికి సున్నం పెట్టడం దుర్మార్గమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్కారు పెద్దలకు అందం హిందోళంగా రా ష్ట్రంలో వ్యవసాయం గందరగోళంగా మా రిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనే దిక్కు లేక రోడ్లపాలైన రైతులను పట్టించుకోకపోవడం శోచనీయమని తెలిపారు. కొనుగోలుకేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయని, అధికారుల దర్శనభాగ్యం కరువైందన్నారు. తూకం వేయడానికి కాంటాలు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు లేని పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ఇది ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ నీతులు చెబుతున్నదని నిప్పులు చెరిగారు. గన్నీ బ్యాగులకే గతి లేదని, రేవంత్ సర్కారుకు మతి లేదని ఎద్దేవా చేశారు.
రైతు భరోసా రాక రైతులు నానాపాట్లు పడుతుంటే, ఏమాత్రం అక్కరకు రాని అందాల పోటీలు నిర్వహించడానికి రూ.200 కోట్లు ఖర్చుపెట్టడం ప్రభుత్వ తిరోగమన విధానాలకు పరాకాష్ట అని విమర్శించారు. అతివల సౌందర్యం పెట్టుబడిగా తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచి అభివృద్ధి చేస్తాననడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
అది బ్యూటీ కాంటెస్ట్ కాదని, కాంగ్రెస్ లూటీ కాన్సెప్ట్ అని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ హింసరాజ్యం వద్దేవద్దని, పదేండ్ల పాలనలో వ్యవసాయానికి స్వర్ణయుగం తెచ్చి రైతును రాజును చేసిన కేసీఆర్ రాజ్యమే ముద్దు అని తెలంగాణ రాష్ట్ర రైతాంగం ముక్త కంఠంతో కోరుకుంటున్నదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.