ఖలీల్‌వాడి, నవంబర్ 26: కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన చారిత్రక నవంబర్ 29న దీక్షాదివస్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనపై సమరశంఖం పూరిద్దామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. 29న నిర్వహించనున్న దీక్షాదివస్‌ను పురస్కరించుకొని నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యలయంలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి గులాబీ సైనికుడు ఒక కేసీఆర్‌లా మారి కాంగ్రెస్‌ను తెలంగాణ నుంచి శాశ్వతంగా తరిమికొట్టడానికి కదం తొక్కాలన్నారు.
36 పార్టీలను ఒప్పించి, నై తెలంగాణ అన్న వారితో జై తెలంగాణ అనిపించిన ధీశాలి కేసీఆర్ పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్ ముష్కర పాలనకు సమాధి చేద్దాం, మళ్లీ కేసీఆర్ స్వర్ణయుగానికి పునాది వేద్దామని పిలుపునిచ్చారు. ఎలక్షన్లో ప్రజల సెలక్షన్ కేసీఆర్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘వార్’ వన్‌సైడ్ అని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడంలో జిల్లాదే కీలక పాత్ర కావాలని, కాంగ్రెస్ పతనాన్ని ఇందూరు గడ్డ నుంచే శాసిస్తామని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి గోబ్యాక్.. కేసీఆర్ కమ్ బ్యాక్ అని గ్రామాలు ముక్త కంఠంతో నినదిస్తున్నాయన్నారు.
పాలిచ్చే బర్రెనమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లు రాష్ట్ర ప్రజల పరిస్థితి అయ్యిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ ఫ్యామిలీ తప్ప ఎవరూ సంతోషంగా లేరని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ తాను, ముఖ్య నేతలంతా స్థానికంగానే ఉంటామని, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేస్తామన్నారు. 29న నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్న దీక్షాదివస్‌కు గులాబీ సైనికులు ఉదయం 9.30లోపు చేరుకోవాలని సూచించారు. రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, దవాఖానల్లో పాలు, పండ్లు పంపిణీ చేస్తామని వివరించారు.