ఖలీల్‌వాడి, ఏప్రిల్ 20: కాంగ్రెస్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెల్లు బిక్కుతున్నదని, త్వరలోనే రేవంత్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అవకాశవాద, అవినీతి, దగాకోరు పాలన ఫలితంగా రాష్ట్రంలో మరణమృదంగం మార్మోగుతున్నదని తెలిపారు. కాంగ్రెస్ పాలనపై ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రేవంత్ అమసర్థ పాలనతో ఇప్పటికే 500మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధి లేక పేద ప్రజల జీవనం చిన్నాభిన్నమైందని పేర్కొన్నారు. పాలనపై విసిగి వేసారిన ప్రజలు.. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేస్తున్నారని తెలిపారు.
వరంగల్ రైతు డిక్లరేషన్‌ను పాతిపెట్టిన రేవంత్ సర్కారు.. రైతుబంధును అమలు చేయకపోవడంతోపాటు తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరాన్ని వినియోగించుకోకపోవడంతో పంటలు ఎండబెట్టిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో వ్యవసాయం కుప్పకూలి రైతన్నకు మానని గాయమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ భూదాహానికి మూగజీవులు సైతం బలవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సర్కారు మోసాలను నిలదీస్తున్న ప్రజలపై కాంగ్రెస్ పొట్టేళ్లు దాడులు చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల భీమ్‌గల్ వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణరావును కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఏమైందని అడిగిన వారిపై దాడి చేయడం కాంగ్రెస్ రౌడీయిజానికి నిదర్శనమని మండిపడ్డారు. నిలదీస్తే కేసులు, నిరసన వ్యక్తంచేస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే జైళ్లు, బీఆర్ఎస్ జెండా పట్టినా, ప్లెక్సీ కట్టినా జైళ్లపాలు చేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్నా చేసినా, ఇంట్లోనే ఉన్నా నిర్బంధాలు అమలు చేయడం రేవంత్ ప్రభుత్వంలో నిత్యకృత్యమయాయని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులను ఉసిగొల్పుతున్నదని తెలిపారు.
ఒక్కో రంగాన్ని టార్గెట్ చేసి కక్షగట్టి అందులోని ప్రముఖుల మీద కేసు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. చివరకు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినా కేసుపెడుతున్నారని, అప్రకటిత ఎమర్జెన్సీ పడగనీడలో రాష్ట్రం బిక్కుబిక్కుమంటున్నదని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అంటే హింసా, విధ్వంసమేనా ? అని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి.. ఎన్నికల హామీలన్నీ గల్లంతు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారుకు పోయే కాలం దాపురించిందని, రేవంత్‌రెడ్డి సాగిస్తున్న దుష్ట పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు ఎంతో దూరంలో లేదని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.