ఖలీల్‌వాడి, జూలై 4 : ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నయవంచనకు పాల్పడిన కాంగ్రెస్ సర్కారును నిలదీసిన నిరుద్యోగుల చేతులకు సంకెళ్లు వేస్తారా ? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. హామీలు అమలుచేయాలని అడిగిన పాపానికి ఇంత నిర్బంధకాండను అమలు చేయ డం నిరంకుశ ఇందిరమ్మ రాజ్యంలో భాగమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నదని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ అధిష్టానం చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
తమ ప్రజాపాలనలో సెక్రటేరియట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి నిరుద్యోగుల వెతలు కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేలా నాటి సీఎం కేసీఆర్ చొరవ తీసుకున్న విషయాన్ని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించని కారణంగా విద్యార్థులు ఉత్తీర్ణులైనప్పటికీ వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ది జాబ్ క్యాలెండర్ కాదని, జాబ్‌లెస్ క్యాలెండర్ అని, ఇది నిరుద్యోగులను నిలువునా ముం చినా దగా కోరు క్యాలండర్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే ఇద్దరు నిరుద్యోగులు చనిపోయారని , ఇంకా ఎంతమంది చనిపోవాలని ప్రశ్నించారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని, రేవంత్‌రెడ్డి సర్కా రు ద్రోహాన్ని ఎండగడుతామని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.