ఖలీల్‌వాడి, ఆగస్టు 13: కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన విధానమంటూ లేకుండా ఇష్టానుసారంగా తెస్తున్న అప్పు తెలంగాణ రాష్ర్టానికి ముప్పుగా పరిణమిస్తోందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ సర్కార్ రాష్ర్టాన్ని అప్పుల కుప్ప చేస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టిందని, అప్పు తేనిదే పూట గడవదన్న రీతిలో విచ్ఛిన్నకర పాలన సాగిస్తున్నదని ధ్వజమెత్తారు. 20 నెలల పాలనలోనే రూ.2.2 లక్షల కోట్ల అప్పు చేసిందని, రోజుకు రూ. 360 కోట్లు, గంటకు రూ. 15 కోట్లు, ప్రతి నిమిషానికి రూ. 25లక్షల చొప్పున అప్పులు చేసి ఒక్క కొత్త పథకం కూడా ప్రారంభించిన పాపాన పోలేదని, మరీ ఆ రూ. 2.2 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. తెచ్చిన అప్పులతో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదని ఆయన ఎద్దేవా చేశారు. కనీసం ఒక్క ఎన్నికల హామీని కూడా అమలు చేయలేద న్నారు.
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో చేసిన అప్పు కేవలం రూ.2.8 లక్షల కోట్లు మాత్రమేనని జీవన్‌రెడ్డి తెలిపారు. సమైక్య రాష్ట్రం నుంచి వచ్చిన రూ.75 వేల కోట్లతో కలిపి మొత్తం రూ. 3.5 లక్షల కోట్లే తెలంగాణ అప్పు అని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం ఇంతకాలం విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌కు చెంప పెట్టు అని ఆయన పేర్కొన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల విలువ రూ. 4.16 లక్షల కోట్లు అని ఆయన వెల్లడించారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరగని పల్లె లేదు, సంక్షేమం అందని ఇల్లు లేదన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాలు కేసీఆర్ ప్రభుత్వ కీర్తి కిరీటాలన్న జీవన్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడాని కేముంది? కాళేశ్వరం డ్యామా.. కల్యాణలక్ష్మి స్కీమా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలకులు అప్పులు తెచ్చి జేబులు నింపుకొంటున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి రూపాయికి పక్కాగా లెక్కలు ఉన్నాయన్నారు. కేసీఆర్ పాలనంటే ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం అని, కాంగ్రెస్ సర్కార్ అంటే ప్రతి ఇంట్లో సంక్షోభం, ప్రతి కంట్లో విషాదం అన్నట్టుగా ఉందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గానికైనా న్యాయం చేశారా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ అమలు కాలేదు. రైతుభరోసా రాలేదు. మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా ఇవ్వడం లేదన్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. చేనేత, గీత కార్మికులకు సర్కార్ భరోసా లేదని తెలిపారు. మత్స్యకారులకు చేప పిల్లలు ఇవ్వరు. యాదవులకు గొర్రెల పంపిణీ నిలిచిపోయింది. దళిత బంధు, బీసీ బంధు ఊసే లేకుండా పోయిందన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న తులం బంగారం అతీగతి లేదు. మహిళలకు రూ. 2500 పెన్షన్, నిరుద్యోగ భృతి ఏమైందో కాంగ్రెస్ నాయకులే చెప్పాలన్నారు.
బతుకమ్మ చీరలు, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా ఇవ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు వాటి ఆలనాపాలనా చూసే దిక్కులేదని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ది మంచి ప్రభుత్వమైతే, రేవంత్‌ది ప్రజలను ముంచే ప్రభుత్వమని నిప్పులు చెరిగారు. సంపద పెంచుడు, పేదలకు పంచుడు కేసీఆర్ విధానమని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. అడ్డి మార్ గుడ్డి దెబ్బలా కాంగ్రెస్ అధికారం దక్కించుకుని ప్రజల బతుకులతో ఆడుకుంటోందన్నారు. రేవంత్‌రెడ్డి 20 నెలలు తిరగక ముందే పాలన చేతకాక చేతులెత్తేసి, లేకి కూతలు కూస్తున్నాడని, తెలంగాణ పరువును బజారున పడేస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో పెట్టుడు తప్ప తిట్టుడు లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో తిట్టుడు తప్ప పెట్టింది లేదన్నారు.
నిజామాబాద్ జిల్లా ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, మంత్రి లేక ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని జీవన్‌రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నిజామాబాద్ వాసి అయినా ఏనాడూ జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా అవతారమెత్తి దోచుకునే పనిలో బిజీగా మారారని ఆరోపించారు. కాంగ్రెస్ పోయి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మంచిదని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్, సుజీత్ సింగ్ ఠాకూర్, రాజేశ్వర్ రెడ్డి, మాస్త ప్రభాకర్ పాల్గొన్నారు.