ఖలీల్‌వాడి, ఏప్రిల్ 30 : రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. పండిన పంటలు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతుల ఇంట కష్టాల మంట పెట్టిందన్నారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు 27 కిలోమీటర్ల పొడవునా రోడ్డుపై కుప్పలు, తెప్పలుగా పోసి ఉన్న ధాన్యం రాసులను బుధవారం ఆయన పరిశీలించారు. పంటలు కొనే దిక్కు లేక పడిగాపులు గాస్తున్న రైతులను ఓదార్చారు.
సర్కార్‌పై ఒత్తిడి తెచ్చి చివరి గింజ కొనుగోలు చేసేవరకు పోరాడుదామని ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. కొనే దిక్కులేక దిగాలు చెందుతున్న రైతులను చూసి గుండె తరుక్కుపోతున్నదని కంటతడి పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొనుగోళ్లు లేక అన్నదాతలు కన్నీళ్లు దిగమింగుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల భయం అన్నదాతలను వణికిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతల వెతలపై అధికార యంత్రాంగానికి పట్టింపులేదని, కనీసం అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని, ఫలితంగా రైతుల కష్టం దళారుల పాలవుతుందన్నారు.
నమ్మి ఓటేసిన రైతులనే కాంగ్రెస్ ప్రభుత్వం కాటేసిందన్నారు. రుణమాఫీ, రైతుభరోసా పేరుతో దగా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ చేస్తామని, రైతుభరోసా, 24 గంటల కరెంట్ ఇస్తామని సిద్ధుల గుట్టపై శివయ్య సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి పెట్టుకున్న ఒట్లు ఏమయ్యాయని నిలదీశారు. అన్నదాతలు ఆపదలో ఉంటే అధికార పార్టీ నేతలెక్కడ నిద్రపోతున్నారని మండిపడ్డారు. రైతులు గోస పడుతుంటే జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కాబోయే మంత్రినని చెప్పుకుంటున్న సుదర్శన్‌రెడ్డి ఎందుకు ముఖం చాటేశారని ప్రశ్నించారు.
అకాల వర్షాలు పడి ధాన్యం తడిస్తే రైతులకు మూడు రెట్లు అధికంగా పరిహారం చెల్లించే బాధ్యత సర్కార్‌దేనని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా రైతులకు నష్టం జరిగితే ఇన్చార్జి మంత్రి జూపల్లి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీఎస్వో జిల్లా రైతుల కష్టాలపై డీఎస్వో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతులను పురుగులను చూసినట్లు చూస్తున్నారని మండిపడ్డారు. డీఎస్వో తీరు మారకుంటే రైతుల కోపాగ్నిని చవిచూడాల్సి ఉంటుందన్నారు. ఆర్మూర్ గడ్డ రైతుల అడ్డా అని, తమతో పెట్టుకున్నోళ్లెవరూ బాగు పడలేదన్నారు. వారం రోజుల్లోగా పంటల కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పది వేల మంది రైతులతో డీఎస్వో, కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తానని హెచ్చరించారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతులకు ఏ కష్టం రాలేదని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ పదేండ్ల పాలన రాష్ట్ర రైతులకు స్వర్ణయుగమని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చినా ఎలాంటి మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఆర్మూర్‌లో నాడు బకాయిలు చెల్లించాలని అడిగిన పాపానికి కడుపులో బుల్లెట్లు దింపిన నాటి కాంగ్రెస్ రాక్షస పాలనే గుర్తుకొస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత తెలంగాణలో మళ్లీ రాతియుగం వచ్చిందన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా మళ్లీ కేసీఆర్ వస్తేనే తమ కష్టాలు గట్టెక్కుతాయని రైతులు కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారని జీవన్‌రెడ్డి తెలిపారు.