ఖలీల్‌వాడి, ఏప్రిల్ 5: రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్నది ప్రజాపాలన కాదని, సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లో నడుస్తున్న రౌడీదర్బార్ అని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూ ర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తిన ఆయన, గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ కార్యాలయం మీద జరిగింది దాడి కాదని, ఇది నాలుగున్నర కోట్ల ప్రజల గుండెల మీద జరిగిన దాడి అని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో అరాచకం కరాళనృత్యం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ జాతిపిత క్యాంపు కార్యాలయంపైనే దాడి చేస్తారా ? ఈ చర్య కాంగ్రెస్ ఉన్మాదమా, కండకావరమా ? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించడంతోనే రేవంత్‌రెడ్డి సీఎం, మహేశ్‌కుమార్ పీసీసీ చీఫ్ అయ్యారని పేర్కొన్నారు. 36 పార్టీలను ఒప్పించి కాంగ్రెస్, బీజేపీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గొప్పతనంపై ప్రణబ్ ముఖర్జీ, అరుణ్ జైట్లీ వంటి దిగ్గజాలే కొనియాడారని గుర్తు చేశారు.
రేవంత్‌రెడ్డి కూడా గతంలో కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చిందని అనలేదా ? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడని, సభా నాయకుడిలా ఆయనకు అన్ని హక్కులు ఉంటాయని , ఎవరి ఫొటో పెట్టుకోవాలో పూర్తిగా కేసీఆర్ ఇష్టమని స్పష్టం చేశారు. లోకసభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్‌గాంధీ తన క్యాంప్ ఆఫీస్లోమోదీ ఫొటో పెట్టుకుంటారా ? అని ఆయన నిలదీశారు. కేసీఆర్ కార్యాలయం మీద దాడిని హత్యాయత్నంగా పరిగణించాలని, కేసులు కఠినంగా పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యక్తి కాదు, ఒక శక్తి అని, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్య దైవమని అభివర్ణించారు. కేసీఆర్‌పై ఈగ వాలినా తెలంగాణ సమాజం సహించబోదని పేర్కొన్నారు.
ప్రజలకిచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకుండా కాంగ్రెస్ కార్యకర్తలను వీధి రౌడీలుగా మార్చి విపక్ష నేతలపై దాడులు చేయిస్తూ డైవర్షన్ రాజకీయాలకు తెర దీసిన సీఎం రేవంత్‌రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తమ గులాబీ సైన్యం కూడా ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దని కేసీఆర్ గాంధీయిజాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని హితవు పలికారు. గులాబీ సైన్యం కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా కనుగమరుగవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ జోలికొస్తే మాడిమసై పోతారని, తస్మాత్ జాగ్రత్త అని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.