Ben Stokes : టెస్టు కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్(Stephen Fleming) నియామయకంతో ఇంగ్లండ్ మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది. ఈక్రమంలోనే వచ్చే ఏడాది స్వదేశంలో జరుగబోయే యాషెస్ సిరీస్(Ashes Series)పై ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు దృష్టి సారిస్తోంది. గత సీజన్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న ఇంగ్లండ్ అందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ మాట్లాడుతూ.. మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) యూటర్న్ తీసుకొనే అవకాశాలు లేకపోలేదని చెప్పాడు.
వచ్చే ఏడాది యాషెస్ సిరీస్‌లో లక్ష్యంగా స్క్వాడ్ కూర్పుపై దృష్టి సారించింది ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. కొత్త కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నేతృత్వంలో నిలకడగా విజయాలు సాధించానలనుకుంటున్న ఇంగ్లండ్.. మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ యూటర్న్ తీసుకున్నా అందుకు సరే అనేలా ఉంది. ఇంతకు ఈ విషయాన్ని జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబిన్ కీ స్వయంగా వెల్లడించాడు. అంతకుముందు ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ మాట్లాడుతూ.. ‘స్టోక్స్ మరొక యాషెస్ ఆడాలనితాను కోరుంటున్నాన’ని అన్నాడు.
— Cricinfo (@cricinfo) July 31, 2026
మెక్‌డొనాల్డ్ కామెంట్స్‌పై స్పందించిన రాబి.. ‘మామూలుగా అయితే వీడ్కోలు అనంతరం స్టోక్స్ కామెంటరీ బాక్స్‌లో ఉండాలి. కానీ, ఆసీస్ కోచ్ కోరుకున్నట్టు అతడు తన నిర్ణయాన్ని మార్చుకుంటే జట్టులోకి తీసుకుంటాం. స్టోక్స్‌తో ఏదైనా సాధ్యమే. అతడు గనుక యూటర్న్ తీసుకుంటే అది చాలా గొప్ప విషయం. అయితే.. అతడు తన ఆలోచనను మార్చుకోకపోవచ్చు. అందులో నాకు ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ఏదైనా జరిగే అవకాశముంది’ అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య వచ్చే ఏడాది జూన్ 18 నుంచి ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ జరుగనుంది.
ఇంగ్లండ్ టెస్టు క్రికెట్‌ను ‘స్టోక్స్‌కు ముందు.. స్టోక్స్ తర్వాత’ అని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. సంప్రదాయ క్రికెట్‌నే నమ్ముకున్న జట్టుకు దూకుడు నేర్పిన కెప్టెన్లలో స్టోక్స్ పేరు ముందు వరసులో ఉంటుంది. ఎంత పెద్ద లక్ష్యమైనా సరే.. వికెట్లు పడుతున్నా సరే.. దంచుడే పరమావధిగా ఆడడం అతడి నైజం. 2022లో జో రూట్ వారసుడిగా టెస్టు పగ్గాలు అందుకున్న స్టోక్స్.. బజ్‌బాల్ ఆటను పరిచయం చేశాడు.

బ్రెండన్ మెక్కల్లమ్ హెడ్‌కోచ్‌గా, దూకుడే మంత్రగా ఆడే స్టోక్స్ సారథ్యంలో.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ వన్డే తరహాలో ఆడడం అలవర్చుకుంది ఇంగ్లండ్. అయితే.. యాషెస్ సిరీస్‌లో పరాజయం, ఆపై స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 1-2తో సిరీస్ ఓటమితో విమర్శలపాలయ్యాడు స్టోక్స్. ఇక టైమ్ వచ్చేసింది అనుకున్నాడేమో లార్డ్స్ టెస్టు మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడీ వెటరన్.