మూడేండ్లుగా పసుపు కొనుగోళ్ల సీజన్ ప్రారంభం కాగానే ఎంపీ అర్వింద్ సరికొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర పెరిగితే తమ కృషే కారణమంటూ గొప్పలు చెప్పుకుంటూ.. ధర పతనమైతే పత్తా లేకుండా పోతున్నారు. పసుపు బోర్డు హామీ నెరవేర్చకపోవడం, మద్దతు ధరను తీసుకురాకపోవడంతో ఇప్పటికే రైతులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు పసుపురాశులు భారీగా తరలివస్తున్నాయి. ఇటీవల నిజామాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ పసుపు క్వింటాలుకు రూ.10వేల వరకు ధర దక్కుతున్నదంటూ ప్రకటించారు. వాస్తవానికి క్వింటాలుకు కనిష్ఠంగా రూ.4,500 పలుకుతుండగా.. గరిష్ఠంగా రూ.6,500 దాటడం లేదు. ధర పెరిగితే పదే పదే ప్రకటనలు చేసే బీజేపీ ఎంపీ… ధర తగ్గినప్పుడు ఎందుకు స్పందించడం లేదంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపు పంటకు పెట్టింది పేరుగా గుర్తింపు పొందిన నిజామాబాద్ జిల్లాలోని రైతులను బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కనీసం పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితు ల మేరకు పసుపునకు క్వింటాలుకు ధర రూ.8 వేలు దాటితే తన ఘనకార్యమంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అదే ధర పతనమైతే పత్తా లేకుండా పోతున్నాడు. వాస్తవానికి రైతుల నుంచి తీవ్రమైన నిరసనను అర్వింద్ ఎదుర్కొంటున్నా డు. పసుపు బోర్డు హామీ నెరవేర్చకపోవడం, మద్ద తు ధరను తీసుకురావడంలో విఫలం కావడంతో రైతులు తిరగబడుతున్నారు. అయితే… మూ డేండ్లుగా పసుపు కొనుగోలు సీజన్ మొదలైనప్పు డు ఎంపీ అర్వింద్ కొంగొత్త నాటకాలకు తెర లేపుతున్నాడు. ఫిబ్రవరి మొదటి వారం నుంచే వ్యవసాయ మార్కెట్లో వేలాది పసుపు కుప్పలు పరుచుకుంటాయి. ఇందులో ఏదో ఒక కుప్పకు క్వింటాలుకు ధరను రూ.8వేలు పైచిలుకు పలికేలా కొన్ని వర్గాలు కుట్రలకు పాల్పడుతున్నాయి. ఆ తర్వాత మిగిలిన కుప్పలకు అదే ధర రాకపోగా కనీసం మద్దతు కూడా నోచుకోని దుస్థితి ఎదురవుతున్నది. కానీ… బీజేపీ శ్రేణులు మాత్రం ఒక కుప్పకు వచ్చిన అత్యధిక ధరనే సోషల్ మీడియాలో వైరల్ చేసి రైతులను ఏటా మోసం చేస్తున్నారు. ఇందుకు ప్రస్తుతం మార్కెట్‌కు పసుపు రాక మొదలైన సమయంలో పలుకుతున్న ధరనే తార్కాణంగా నిలుస్తోంది.
పది రోజుల క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో అర్వింద్ పర్యటించారు. పసుపునకు క్వింటాలుకు రూ.8 నుంచి రూ.10వేలు దక్కుతున్నదంటూ ఇరువురు ఎంపీలు ప్రకటనలు చేశారు. ఇదంతా తమ గొప్పతనమేనని మీడియా ముందు ఘనంగా చెప్పుకున్నారు. ఈ మాటలు చెప్పి నేటికి 10 రోజులు కూడా గడవక ముందే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు పంట ధర ఘో రంగా పతనమైంది. మార్కెట్‌కు పసుపు పంట రాక మొదలైన ప్రస్తుత సమయంలో క్వింటాలుకు కనిష్ఠంగా రూ.4,500 పలుకుతుండగా.. గరిష్ఠంగా రూ.6,500 దాటడం లేదు. బీజేపీ ఎంపీల మాటలు విని మార్కెట్‌కు వచ్చిన రైతులంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. పసుపునకు క్వింటాలుకు రూ.10వేలు వస్తుందని ప్రగల్భాలు పలికిన ఎంపీలు ఎక్కడున్నారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణం గా పసుపు ధర పెరిగితే కేంద్ర ప్రభుత్వం గొప్పతనంగా చిత్రీకరిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో కనిపిస్త్తున్న అనుకూలతలను ఎంపీ ధర్మపురి అర్వింద్ తనకు అనుకూలంగా మార్చుకుని ప్రకటనలు చేయడంపై రైతు లోకం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ధర పెరిగితే పదే పదే ప్రకటనలు చేసే బీజేపీ ఎంపీ… ధర తగ్గినప్పుడు ఎందుకు స్పందించడం లేదంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల వరకు వచ్చే పసుపు దిగుబడి ఈసారి గణనీయంగా తగ్గిపోయింది. సగటున కొమ్ము 8 క్వింటాళ్లు, మండ 10 క్వింటాళ్లకే పరిమితం అవుతున్నది. దీంతో కనీసం 20 క్వింటాళ్లు దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఈ సీజన్లో అధిక వర్షాలు, చీడపీడలే కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు తగ్గిన నేపథ్యంలో ఈ సారి మద్దతు ధర రూ.15వేలు ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఎకరాకు రూ.1.20లక్షల వరకు పెట్టుబడి అవుతున్న నేపథ్యంలో ఈ మా త్రం రాకుంటే నష్టాలు తప్పవని అంచనా వేస్తున్నా రు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 40వేల ఎకరాల్లో పసుపు పంటను పండిస్తున్నారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఐదు దశాబ్దాలుగా రైతులు పసుపును సాగు చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌కు పసుపు రాక మొదలు కాని సమయంలో జనవరి 20న క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.9,898 వచ్చింది. దీంతో ఎలాగైన ఆశాజనకంగా ధర ఉంటుందని అంతా భావించగా అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తున్నది. రూ.15వేలు మద్దతు ధరను డిమాండ్ చేస్తున్న పసుపు రైతులకు కనీసం రూ.10వేలు వస్తుందని అనుకున్నారు. అది కాస్త రూ.5వేల కన్నా దిగువకు చేరడంతో గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు పసుపు ధర కనిష్ఠంగా రూ.4,500, గరిష్ఠంగా రూ.6,600 మాత్రమే పలుకుతున్నది.
నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ అతి కొద్ది కాలంలోనే ప్రజల నుంచి తీవ్రమైన నిరసనను ఎదుర్కొంటున్నారు. బాండ్ పేపర్ మీద పసుపు బోర్డు హామీని రాసిచ్చి ఎంపీగా గెలవగానే ముఖం చాటేసిన నాటి నుంచి రైతుల్లో విశ్వాసం కోల్పోయారు. గ్రామాల్లో పర్యటనకు వెళ్లాలంటే బీజేపీ శ్రేణులతో పాటు ఎంపీ సైతం భయపడే పరిస్థితి ఏర్పడింది. ఏ రైతు ఎటువైపు నుంచి వచ్చి నిలదీస్తాడో అన్న భయం ఎంపీని వెంటాడుతున్నది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు, తానిచ్చిన హామీల నుంచి రైతులను పక్కదోవ పట్టించేందుకు ధర్మపురి అర్వింద్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న ఇస్సాపల్లిలో పసుపు రైతులు అడ్డగిస్తే వారిపైనే ఎంపీ దాడులకు ఎగబడ్డాడు. అంతకు నెల రోజుల ముందు కూడా గన్నారంలో ఇదే తీరును ప్రదర్శించాడు. జనవరి 27న ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలంలో రైతులపై దాడి చేయబోగా దెబ్బలు తిన్న బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వచ్చారు. పసుపు పంటకు గతంలో ఎన్నడూ లేని విధంగా తమ మూలంగానే మద్దతు ధర లభిస్తుందంటూ చెప్పుకున్నారు.
రూ.8వేలు నుంచి రూ.10వేలు గిట్టుబాటు దక్కుతున్నదని ప్రకటించారు. సీన్ కట్ చేస్తే సరిగ్గా పది రోజుల్లోనే అంతా గందరగోళమైంది. పసుపు మద్దతు ధర రూ.5 వేలకు దిగువకు అంటే క్వింటాలు పసుపు కనిష్ట ధర రూ.4,500, గరిష్ట ధర రూ.6,500 ఉండడం రైతులను మనోవేదనకు గురి చేస్తోంది.
పసుపు రైతులకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఎకరానికి లక్షా 20వేల పెట్టుబడైంది. ఇప్పుడున్న ధరతో పసుపు రైతులకు ఒరిగేదేమీ లేదు. రూ.15వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పిన బీజేపీ ఎంపీ అర్వింద్ తన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నాం.
– గంగాధర్, పసుపు రైతు,నిజామాబాద్ జిల్లా