Minister Seethakka | రామారెడ్డి : బోనస్ ఎప్పుడిస్తారని, సకాలంలో పంట కొనుగోళ్లు త్వరగా చేపట్టాలని రైతులు మంత్రి సీతక్క ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సీతక్క రైతులపై దురుసుగా ప్రవర్తించి అసలు మీరు రైతులేనా అంటూ అవమానించారు. దీంతో ఆగ్రహించిన రైతులు మంత్రి సీతక్కను అడ్డుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు షబ్బీర్ అలీతో కలిసి వచ్చారు. మంత్రి వస్తున్నారన్న సమాచారంతో రైతులు ఆమె కారును ఆపి తమకు గతంలో ప్రకటించిన బోనస్ ఇంకా రాలేదని, పంట కొనుగోళ్లు సకాలంలో జరుగడం లేదని, కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు.
దీంతో ఆమె ఆగ్రహించి వారిపై దురుసుగా ప్రవర్తించి అసలు మీరు రైతులేనా..? అంటూ అవమానించారు. దీంతో కోపోద్రోక్తులైన రైతులు మంత్రిని అడ్డుకున్నారు. వీషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంత్రిని బందోబస్తు మధ్య అక్కడి నుండి తీసుకెళ్లారు. కాగా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.