Runa Mafi | పంటరుణాల మాఫీపై సర్కారు పెట్టిన ఆంక్షలు రైతాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. రేషన్‌కార్డుతో పాటు ‘పీఎం కిసాన్’ నిబంధనలను ప్రామాణికంగా తీసుకోవడం వంటివి అన్నదాతల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలకు ముందు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ఒట్టేసి మరీ చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఇలా కొర్రీలు విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీపై సర్కారు తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా నిబంధనల ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాలో చాలా మందికి రుణమాఫీ వర్తించకపోయే ప్రమాదముంది. కిసాన్ సమ్మాన్ యోజన, రేషన్ కార్డు నిబంధన అంటూ విధివిధానాలను ప్రకటించడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టింది. 2018లో రెండోసారి కేసీఆర్ సర్కారు కొలువుదీరిన తర్వాత అసాధారణమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రధానంగా కరోనా ముప్పును ప్రపంచమంతటా ఎదుర్కొంది. దీంతో రుణమాఫీ అమలులో జాప్యం జరిగింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ అవేవీ పట్టించుకోకుండా రైతులను తప్పుదోవ పట్టించింది. కేసీఆర్ సర్కారు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసినప్పటికీ కాంగ్రెస్ దుష్ప్రచారానికి ఒడిగట్టింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దాదాపుగా 5లక్షల మంది రైతులకు పంట రుణాలను మాఫీ చేసి చూపించింది. రైతులంతా కేసీఆర్‌కు జై కొడతారని గ్రహించి రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముంగిట రూ.2లక్షల రుణమాఫీని ఎత్తుకున్నది. రుణమాఫీ పొందిన వారు తిరిగి రుణాలను తెచ్చుకోవాలంటూ రెచ్చగొట్టారు. రేవంత్ మాటలను నమ్మి రుణాలు తెచ్చుకున్న వారిపై ఇప్పుడు వడ్డీల భారం పడుతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామని చెప్పి ఏడు నెలలుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తీరా ఆగస్టు 15లోపు రైతు రుణాలు రద్దు చేస్తామని హామీ ఇవ్వగా నిబంధనల కొర్రీలతో సగానికి ఎక్కువ మందికి మాఫీ దక్కకుండా చేస్తున్నట్లుగా అర్థమవుతున్నది. చాలా మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నప్పటికీ సాంకేతికంగా రేషన్‌కార్డు లేని వారు, కిసాన్ సమ్మాన్ యోజన పరిధిలోకి రాని వారు కూడా ఉన్నారు. ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకుంటే చాలా మందికి రుణమాఫీ రాకపోవచ్చన్న భయం ఇప్పుడు అందరిలోనూ పట్టుకున్నది. బేషరతుగా రూ.2లక్షల్లోపు రైతురుణాలను మాఫీ చేయాలని, నమ్మించి మోసం చేయడం తగదంటూ ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన వాగ్దానాలను రైతులు నమ్మారు. రైతు సర్కారుగా ముద్రపడిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని హస్తం పార్టీకి ఓట్లు వేశారు. నమ్మశక్యం కాని హామీలకు ఆసక్తి చూపిన రైతులంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం అందించే వరాల మూటపై ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రధానంగా పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా రూ.15వేలు, రూ.2లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు ప్రోత్సాహకాలు, వరి ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ వంటి హామీలున్నాయి. గద్దెనెక్కి ఏడు నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పటి వరకు రెండు సీజన్లు ముగిసినప్పటికీ రైతుబంధు బదులుగా కాంగ్రెస్ ఇవ్వజూపిన రైతుభరోసా ఎక్కడా అమలు కాలేదు. గత యాసంగిలో అరకొరగా రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని కేవలం 5ఎకరాల్లోపు రైతులకు అందించారు. ఈ వానకాలం సాగు మొదలై రెండు నెలలు కావొస్తున్నప్పటికీ ఇంత వరకూ అతీగతీ లేదు. రైతుభరోసాకు మార్గదర్శకాల పేరిట ఊరూరా తిరుగుతూ రైతులతో ముఖాముఖి పేరిట మంత్రుల కమిటీ తాత్సారం చేస్తున్నది. పంటకాలం గడుస్తున్నప్పటికీ రైతులకు చిల్లిగవ్వ సాయం అందించకుండా కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తున్నది. ఈ పరిస్థితిపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలో సీజన్ మొదలవ్వడానికి ముందే బ్యాంక్ అకౌంట్లో రూ.5వేలు జమ అయ్యేవని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక రైతుభరోసా పేరిట ఇస్తామన్న పెట్టుబడిసాయం పత్తాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక యాసంగిలో వరి ధాన్యానికి ఇవ్వాల్సిన బోనస్ రూ.500లకు కాంగ్రెస్ మంగళం పాడింది. వానకాలంలో సన్నవడ్లకు మాత్రమే ఇస్తామంటూ దాటవేసి ఒక సీజన్‌ను తప్పించుకున్నది. ఈ సీజన్లో వచ్చే సన్నవడ్లకైనా బోనస్ వర్తిస్తుందా? లేదంటే నిబంధనల పేరిట కొర్రీలు పెడతారా? అంటూ రైతులు గుసగుసలాడుతున్నారు.
ఇందల్వాయి, జూలై 16: ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణాలు మాఫీ చేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటకు కట్టుబడాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంక్షలు విధించడం సరికాదు. మరోసారి ఆలోచించి రైతులకు తగిన న్యాయం చేయాలి.
ప్రభుత్వం ఏర్పడక ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయడంతోపాటు రుణమాఫీ పథకాన్ని కౌలు రైతులకు సైతం వర్తింపజేయాలి. అప్పుడే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరినట్లవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రైతులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉ న్నాయి. రైతులకు ఎలాంటి నష్టం కలుగకుండా నిర్ణయం తీసుకోవాలి. కౌలు రైతులు రాష్ట్రంలోఎందరో ఉన్నారు. వారిని కాపాడుతారనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఓటేశారు. హామీలను విస్మరిస్తే రాష్ట్ర ప్రజలు తిరగబడుతారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీని ఎలాంటి ఆంక్షలు లేకుండా వర్తింపజేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం రుణమాఫీ చేయకుంటే రైతులు ఆందోళనకు దిగే పరిస్థితి ఉంటుంది. కొత్త విధానాలతో రైతులకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే సహించబోం.