నమస్తే తెలంగాణ నెట్వర్క్ : తెలంగాణ పోరాట యోధుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. గులాబీ దళపతిని విచారణ పేరిట వేధిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలతో హోరెత్తించాయి. స్వరాష్ట్ర సాధనతో పాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సర్వస్వం ధారపోసిన గులాబీ సారథిని రేవంత్ ప్రభుత్వం వేధిస్తుండడాన్ని నిరసిస్తూ ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. ఊరూరా పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతోపాటు రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. శాంతియుతంగా చేపడుతున్న నిరసనలపై ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ఎక్కడికక్కడ అణచివేతలకు పాల్పడింది. ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ఈ రకంగా అణచివేతకు పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆర్మూర్‌టౌన్, ఫిబ్రవరి1: గాంధేయ మార్గంలో పోరాడి తెలంగాణ సాధించిన మహోన్నత ఉద్యమ నేత, తెలంగాణ తొలిసీఎం కేసీఆర్‌ను విచారణ పేరుతో వేధించడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక అభాసుపాలవుతున్న సీఎం రేవంత్‌రెడ్డి సిట్ ద్వారా నోటీసులు ఇప్పించారని, కానీ ఆ నోటీసులకు బీఆర్ఎస్ పార్టీ జంకదని పేర్కొన్నారు. ఇది అంతం కాదని, ఆరంభమని, రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైనదని వ్యాఖ్యానించారు.

పట్టణంలోని కెనాల్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏం నేరం చేశారని కేసీఆర్‌ను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించినందుకా, కాళేశ్వరం కట్టినందుకా, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌తో రైతులను రాజులుగా చేసినందుకా, మిష న్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచి నీరు ఇచ్చినందుకా అని ప్రశ్నించారు.
కల్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేయడం, రూ. 200 పింఛన్ రూ. 3వేలకు పెంచడం, పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం, సచివాలయాన్ని అద్భుతంగా కట్టడం కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కేసీఆర్ చేసిన నేరాలా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, ఫోన్ ట్యాంపింగ్ అంశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే సిట్ పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. ఫోర్త్ సిటీ పేరుతో పాలకులు రూ.కోట్లు వెనకేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ఆర్మూర్‌లో బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 36 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అందరి లెక్కలు తేలుస్తామన్నారు. అంతకుముందు ధర్నా చేస్తున్న సమయంలో జరిగిన తోపులాటలో జీవన్‌రెడ్డి స్పృహ తప్పి పడిపోవడంతో కొంత సేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నిజామాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / ఖలీల్‌వాడి: ఫోన్ ట్యాపింగ్ అంశంలో బాధ్యులు పోలీసులేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కుండ బద్ధలు కొట్టారు. ఈ వ్యవహారంలో సీఎం, మంత్రులకు సంబంధం ఉండదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసేది పోలీసులేనని చెప్పారు. వారికి అనుమతులు ఇచ్చేది ఇంటెలిజెన్స్ ఐజీ, డీజీపీ, హోంశాఖ సెక్రటరీ మాత్రమేనని తెలిపారు. రాష్ట్రంలో జరిగే విషయాలపై సీఎంకు సమాచారం మాత్రమే ఇస్తారని సమాచారం ఎలా వచ్చిందనే దానిపై సంబంధం ఉండదన్నారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే అందుకు నాటి ఐజీ ఇంటెలిజెన్స్, డీజీపీ, హోం సెక్రటరీ బాధ్యులవుతారని, సిట్‌కు నేతృత్వం వహిస్తున్న పోలీసులకు దమ్మూ ధైర్యం ఉంటే వారిని విచారణకు పిలవాలని సవాల్ చేశారు. సంబంధం లేని వ్యక్తులను వేధిస్తూ, అనుమానిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో వేముల మాట్లాడారు.
సిట్ విచారణకు సహకరిస్తానని కేసీఆర్ చెప్పినప్పటికీ చిల్లర బుద్ధితో రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే అవమానించాలని నందినగర్‌లోని ఆయన ఇంటి గోడకు నోటీసులు అంటించారన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉంటారో పోలీసులకు తెలియదా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి, ఆయన బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణి బొగ్గు కుంభకోణం మసి అంటుకున్నదని ఆరోపించారు. సీఎం, మంత్రులు దండుపాళ్యం బ్యాచ్ మాదిరిగా ఈ రాష్ర్టాన్ని దోచుకు తింటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకు అర్థమైతున్నదని చెప్పారు. పోలీసులు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ లీడర్లను వేధిస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ఒక ఫెయిల్యూర్, సున్నా ముఖ్యమంత్రి అని వేముల విమర్శించారు.ఎన్నికలప్పుడు ప్రజలకు అనేక మాటలు చెప్పి, నమ్మించి ఓట్లు దండుకుని ఏ ఒక్క పని చేయకుండా మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.ప్రపంచంలోనే అత్యధికంగా తిట్లు తింటున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డి పేరు చెబితే తెలంగాణలో ఉమ్మేస్తున్నారని వ్యాఖ్యానించారు.
బాన్సువాడ, ఫిబ్రవరి 1: తన పోరాటం ద్వారా కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ తెస్తే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను నిరసిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ కార్య్రమంలో బాజిరెడ్డి, మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ గిర్దావర్ గంగారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన పులిని చూసి నక్క వాతలు పెట్టకున్నట్లు ఉన్నదన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి, ఉద్యమించిన నాయకుడు కేసీఆర్ అని, పదవులను కూడా త్యాగం చేశారని తెలిపారు. అదే ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన తుపాకీరాముడు అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఒక సూక్ష్మజీవి లాంటి వాడని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నాయకులు చేసే ఆక్రమాలు, కుంభకోణాలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌కుమార్ బయటపెడితే ఎక్కడ ప్రజలకు తెలుస్తుందోనని రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు.ఇచ్చిన హామీలను అడిగితే రేవంత్ ప్రభుత్వం పోలీసులతో కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేసే కార్యక్రమాలు చేపడుతున్నదని ఆరోపించారు.
బోధన్, ఫిబ్రవరి 1: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సర్కారు దుష్ట చర్యలు మానుకోవాలని, ఆయనను ముట్టుకుంటే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ హెచ్చరించారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ బోధన్- నిజామాబాద్ రహదారిపై ఆచన్‌పల్లి వద్ద చేపట్టిన రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి దిష్టిబొమ్మను లాక్కున్నారు. షకీల్‌తోపాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని, చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగా కేసీఆర్‌పై సిట్ విచారణ పేర నోటీసులు పంపడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బంగారు తెలంగాణ సాధించాలనే కాంక్షతో ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచాయని, కేసీఆర్ పథకాలు అందని కుటుంబాలు లేవని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను గుర్తించి, వారి దృష్టిని మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలని హితవు పలికారు. కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలు, రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
కామారెడ్డి, ఫిబ్రవరి 1: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారణ పేరిట వేధింపులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వందమీటర్ల లోతులో బొందపెడతామని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రెండేండ్ల నుంచి కేసీఆర్‌ను రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన యోధుడు కేసీఆర్‌ను సిట్ పేరుతో విచారణకు పిలువడం బాధాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిది దుష్టపాలన అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురిచేస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు భయపడబోరన్నారు. ప్రజా కోర్టులో రేవంత్‌రెడ్డిని శిక్షించడం ఖాయమని పేర్కొన్నారు. ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమే అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్,పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి,నాయకులు గరిగంటి లక్ష్మీనారాయణ, భానుప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్‌ను సిట్ విచారణ కోసం పిలిచిన విధానం సరైంది కాదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. చట్టాన్ని గౌరవిస్తానని చెప్పినప్పటికీ నందినగర్‌లో గోడలకు నోటీసులు అంటించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదీ సంధి కాలమని రేవంత్ రెడ్డికి సీఎం సీటు శాశ్వతం కాదన్నారు. సీఎం, ఆయన బావమరిది, కుటుంబ సభ్యులు చేస్తున్న స్కామ్‌లపై కృష్ణార్జులైన కేటీఆర్, హరీశ్ రావు ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. మొన్న దావోస్‌కు అక్కడి నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి నుంచి తెలంగాణలో సినిమా నడిపిస్తున్నాడని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రెండు రోజుల గ్యాప్‌తో కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్ రావును విచారణకు పిలిచి ఇప్పుడు కేసీఆర్‌ను విచారిస్తున్నారని తెలిపారు. టెలిఫోన్ ట్యాపింగ్ గతంలో చంద్రబాబు కింద పని చేసినప్పుడు జరగలేదా? అంటూ రేవంత్ రెడ్డిని బిగాల ప్రశ్నించారు.

కేంద్రంలో మన్మోహన్ సింగ్, రాష్ట్రంలో వైఎస్సార్ అధికారంలో ఉన్నప్పుడు ట్యాపింగ్ చేయలేదా? ప్రమాణం చేస్తారా? అని సవాల్ విసిరారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో తమ ఫోన్లు ట్యాపింగ్‌కు గురి కావడం లేదా? ట్యాపింగ్ జరుగుతలేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ర్యాలీ తీస్తే దిష్టిబొమ్మను పోలీసులు ఎత్తుకు పోవడంపై బిగాల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో దిష్టిబొమ్మ దహనం చేయడం ఇదే తొలిసారా? అని అడిగారు. గతంలో కాల బెట్టలేదా అని ప్రశ్నించారు. నల్ల బ్యాడ్జీలు కాల్చి నిరసన చెప్పాలనుకుంటే వాటిని కూడా ఎత్తుకు పోయారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను డైవర్ట్ చేసే ప్రక్రియలో భాగంగానే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు. ఎన్ని కుతంత్రాలు చేసినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, దండు శేఖర్, సుజిత్ సింగ్ ఠాకూర్, సుమనా రెడ్డి, విశాలిని రెడ్డి, దాదాన్నగారి మధుసూదన్ రావు, మంజులా యాదవ్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.