HomeNizamabadAngry Employees Government Ignoring Demands
భగ్గుమంటున్న ఉద్యోగులు.. డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం
హామీలు ఎగ్గొట్టి రైతులు, మహిళలను మోసగించిన రేవంత్ సర్కారు.. చివరకు ఉద్యోగులను కూడా వంచించింది. డీఏలతో పాటు పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం మొండిచేయి చూపింది. దీంతో ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.
ఐదు డీఏలకు రెండే.. ఇప్పుడిచ్చేది ఒక్కటే..
మంత్రిమండలి నిర్ణయాలపై ఉద్యోగుల రుసరుస
ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ
సమస్యల పరిష్కారంపై పోరుబాటకు కార్యాచరణ
జేఏసీ నేతృత్వంలో దశల వారీగా నిరసన కార్యక్రమాలు
నిజామాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హామీలు ఎగ్గొట్టి రైతులు, మహిళలను మోసగించిన రేవంత్ సర్కారు.. చివరకు ఉద్యోగులను కూడా వంచించింది. డీఏలతో పాటు పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం మొండిచేయి చూపింది. దీంతో ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏడాదిన్నర దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పూటకో మాట చెబుతూ కాలం గడుపుతుండడంపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు పోరుబాటకు సిద్ధమవుతున్న తరుణంలో భయపడిన ప్రభుత్వం కంటితుడుపు చర్యలకే పరిమితమైంది. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా, ఒక డీఏ ఇప్పుడు ఇవ్వాలని, మరొకటి ఆర్నెళ్ల తర్వాత ఇవ్వాలని మంత్రిమండలి తాజాగా నిర్ణయించడంపై ఉద్యోగ సంఘాలు రుసరుసలాడుతున్నాయి.
డీఏ అమలు అన్నది ఉద్యోగుల ప్రాథమిక హక్కు. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కారు ఈ విషయంలో తాత్సారం చేస్తూ తమ మనోభావాలను దెబ్బ తీస్తుండడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. న్యాయంగా రావాల్సిన డీఏ బకాయిలతో పాటుగా పీఆర్సీ అమలుపై మాట దాటవేయడం సరికాదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు సర్కారుపై మండిపడుతున్నారు.
ఉద్యోగులతో కాంగ్రెస్ చెలగాటం..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేసింది. వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది. డిమాండ్ల సాధనకు ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి నిలదీస్తుంటే ప్రభుత్వం ఉల్టా వారిపైనే నిందలు మోపుతున్నది. వారి జీవితాలతో చెలగాటమాడుతున్నది. ప్రస్తుతం చెల్లించాల్సిన డీఏ బకాయిలు 5 ఉండగా, జూలై నెలతో వీటి సంఖ్య 6కు చేరనుంది. ప్రతి ఆర్నెళ్లకోసారి డీఏలు అమలు చేయాల్సిన బాధ్యత ఉండగా, సర్కారు తప్పించుకుంటున్నది. సంక్షేమ కార్యక్రమాలకే నిధులు లేవంటూ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటనలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుండటంపై విస్మయం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయలేకనే రేవంత్‌రెడ్డి ఈ రకమైన వాదనను ప్రచారంలోకి తెస్తున్నాడన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.
సర్కారుపై ఉద్యోగుల అసంతృప్తి…
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డీఏలు పెండింగ్‌లో లేవు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పాలనలో ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండడంపై ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 15 రోజుల్లో పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు ఇటీవల హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ 10 శాతం కూడా క్లియర్ కాలేదు. నెలకు రూ.650 కోట్లు బిల్లులు క్లియర్ చేస్తామని ఇచ్చిన హామీని ఉల్లంఘించిన రేవంత్ ప్రభుత్వం.. ఉద్యోగుల్లో నమ్మకం కోల్పోయింది. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లే పెండింగ్ బిల్లులను ఎందుకు మంజూరు చేయడం లేదని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడడం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నాయి. ఖజానాకు జ్వరం వచ్చింది. పత్యం చేయాలని సీఎం అనడంపైనా ఉద్యోగ వర్గాల్లో నిరసన వెల్లువెత్తుతున్నది. ఒక్క ఉద్యోగులకు మాత్రమే ఈ నీతి సూత్రాలు వర్తిస్తాయా? సీఎం, మంత్రులు, ఐఏఎస్‌లకు పత్యం వర్తించదా? అంటూ అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులం అడ్డా మీది కూలీలమా? ప్రతి దానికీ అడుక్కోవాల్నా అంటూ మండిపడుతున్నారు.
ఉద్యోగుల డిమాండ్లు పట్టించుకోలే..
యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులను చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేశాయి. ఉద్యోగుల హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)ను పూర్తిస్థాయిలో అమలుచేయాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పింఛన్ విధానం అమలు చేయాలని కోరాయి. 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని, స్థానిక ప్రాతిపదికన అదనపు పోస్టులను సృష్టించి జీవో 317ను అమలుచేయాలని విజ్ఞప్తి చేశాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల కమిటీ (డీపీసీ)లను ఏర్పాటు చేసి, ప్రమోషన్లు కల్పించాలని, సాధారణ బదిలీలు తక్షణం చేపట్టాలని.. ఇలా ప్రధాన డిమాండ్లను ఉద్యోగ సం ఘాలు ప్రభుత్వం ముందుపెట్టాయి.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను జూన్‌లోపు పరిష్కరించకపోతే సామూహిక సెలవులు పెట్టేందుకు, పెన్‌డౌన్ చేపట్టేందుకు ఉద్యోగ జేఏసీ సిద్ధమైంది. ఉద్యోగుల డిమాండ్ల ను ఏమాత్రం పట్టించుకోని మంత్రిమండలి.. ఒక డీఏ ఇప్పుడు, మరోటి ఆర్నెళ్ల తర్వాత ఇచ్చేందుకు ముందుకొచ్చింది. సర్కారు నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ జేఏసీ.. ఉద్యమ కార్యాచరణలో భాగంగా జూన్ 9న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారి పంథా ఏ విధంగా ఉండబోతున్నదనేది ఆసక్తిగా మారింది.
పీఆర్సీ మాటెత్తకపోవడం విడ్డూరం..
ప్రభుత్వం పీఆర్సీ మాటెత్తక పోవడం విడ్డూరంగా ఉన్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వర్తించే డీఏలను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు మంజూరు చేయాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఉన్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంగా ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడమంటే ఉద్యోగులను మోసం చేయడమే.
– చకినాల అనిల్‌కుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వ నిర్ణయం నిరాశ పరిచింది..
ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంటే ఇప్పుడు ఒకటే ఇచ్చారు. ఆర్నెళ్లకు మరోటి ఇస్తామంటున్నారు. ప్రభుత్వ తీరు సరికాదు. కనీసం మూడు డీఏలు వెంటనే అమలు చేస్తారని ఆశ పడితే నిరాశే మిగిలింది. వేతన సవరణ ఊసే ఎత్తలేదు. ఎప్పుడో అమల్లోకి రావాల్సి ఉండగా ఉలుకూపలుకూ లేకుండా పోయింది. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలి. దీనిపైనా మాటెత్తక పోవడం శోచనీయం.
– మాడవేడి వినోద్ కుమార్, బీసీటీయూ, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు