సారంగాపూర్/ సిరికొండ/ కోటగిరి/ వేల్పూర్/ భీమ్‌గల్/ మాక్లూర్/ మోర్తాడ్/ముప్కాల్, మే 30: వానకాలం సీజన్లో పంట సాగు కోసం రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో వ్యవసాయాధికారులు రైతులతో గురువారం సమావేశాలు ఏర్పాటు చేసి విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల సాగుపై సూచనలు చేశారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో రూరల్ ఏడీఏ ప్రదీప్‌కుమార్ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు.
విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. లైసెన్స్ కలిగి ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని, రసీదు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఈవో జ్ఞానేశ్వర్‌రెడ్డి, నాయకులు కోర్వ రాజేంద్రప్రసాద్, నరేందర్, అబ్బన్న, గంగాధర్, సాయికుమార్, గంగమల్లు, భాస్కర్, ప్రతాప్, రైతులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని చిన్నవాల్గోట్, సర్పంచ్ తండా, గోప్యా తండా, తాటిపల్లి గ్రామాల్లో ఏఈవోలు కృష్ణారెడ్డి, శివాణి, శ్రీకాంత్ రైతులతో సమావేశం నిర్వహించారు. విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల సాగుపై అవగాహన కల్పించారు.
కోటగిరి మండల కేంద్రంలోని చావిడి వద్ద రైతులకు విత్తనాలపై మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌రావు, ఏఈవో ఆస్మాబేగం రైతులకు అవగాహన కల్పించారు. రైతులతో సదస్సు నిర్వహించి సూచనలు చేశారు. రైతలుకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని భీమ్‌గల్ ఏడీఏ మల్లయ్య డీలర్లను ఆదేశించారు. వేల్పూర్ మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు గురువారం తనిఖీ చేశారు. భీమ్‌గల్ ఏడీఏ మల్లయ్య మాట్లాడుతూ గుర్తింపు పొందిన కంపెనీల నుంచి మాత్రమే విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అమ్మాలని, సీడ్ కొనుగోలు చేసిన ప్రతి రైతుకూ రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు.
కాలవ్యవధి దాటిన విత్తనాలు, పురుగు మందులు, నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి నర్సయ్య, ఎస్సై వినయ్ పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనాలను ఎమ్మార్పీకి విక్రయించాలని భీమ్‌గల్ ఏవో సాయికృష్ణ అన్నారు. భీమ్‌గల్ మండలంలోని పలు గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయశాఖ అధికారులు లక్పతి, దివ్య, భార్గవ్ పాల్గొన్నారు. మాక్లూర్ మండల కేంద్రంలోని పలు విత్తనాల షాపులను ఏవో తనిఖీ చేశారు. కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం లోగా కల్లెడి, మాక్లూర్ సొసైటీలకు జీలుగ విత్తనాలు వస్తాయని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
ముప్కాల్ మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను ఏవో రాజ్‌కుమార్, ఎస్సై భాస్కరాచారి తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని, ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. కొనసాగుతున్న తనిఖీలు మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లోని ఫర్టిలైజర్షాపులను వ్యవసాయాధికారులు తనిఖీ చేశారు. విత్తనాల విక్రయం, రసీదులు ఇవ్వడం, రిజిష్టర్‌లో రైతుల పేర్లు నమోదు చేయడం తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమాల్లో ఏవో లావణ్య, ఏఈవోల రంజిత్, మోహన్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.