బోధన్ రూరల్, మే 28: చెక్‌పోస్టుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం సాలూరా వద్ద ఉన్న తెలంగాణ -మహారాష్ట్ర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నిజామాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తన సిబ్బందితో కలిసి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5గంటల వరకు తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ వద్ద నుంచి రూ.13,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందస్తుగా తమ సిబ్బందితో చెక్‌పోస్టుపై నిఘా పెట్టామని, కొన్ని వాహనాల వారు పర్మిట్ తీసుకోవడం, మరికొందరు వాహనదారులు టేబుల్‌పై డబ్బులు పెట్టి వెళ్లడాన్ని గమనించినట్లు తెలిపారు. దీంతో వెంటనే చెక్‌పోస్టును తనిఖీ చేయగా విధుల్లో కంప్యూటర్ ఆపరేటర్, ఒక హెడ్‌కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారని, ఏఎంవీఐ శ్రీకాంత్ డ్యూటీలో లేకపోవడంతో అతన్ని పిలిపించామన్నారు. చెక్‌పోస్టును తనిఖీ చేయగా కంప్యూటర్ ఆపరేటర్ వద్ద రూ.13,500 లభ్యమయ్యాయని, వాటిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఇన్స్పెక్టర్ నాగేశ్, శ్రీనివాస్, వేణు తదితరులు ఉన్నారు.