HomeNizamabadAbundant Water Resources With Restoration Of Ponds
చెరువు నిండుగా.. రైతన్నకు పండుగ
ఒకనాడు పల్లెర్లు మొలిచిన పంట పొలాలు నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో బీళ్లు వారిన భూములు స్వరాష్ట్రంలో ధాన్యపు సిరులను కురిపిస్తున్నాయి. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువులు స్వరాష్ట్రంలో నిండుకుండలా దర్శనమిస్తున్నాయి.
చెరువుల పునరుద్ధరణతో పుష్కలంగానీటి వనరులు
పెరిగినభూగర్భ జలాలు
రెండు పంటలకూ సరిపడా సాగునీరు
సస్యశ్యామలమైన బీడు భూములు
ఒకనాడు పల్లెర్లు మొలిచిన పంట పొలాలు నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో బీళ్లు వారిన భూములు స్వరాష్ట్రంలో ధాన్యపు సిరులను కురిపిస్తున్నాయి. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువులు స్వరాష్ట్రంలో నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. నాడు ఎడారిని తలపించిన తెలంగాణ మాగాణం.. స్వయం పాలనలో ధాన్యాగారంగా మారింది. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. ఇదంతా మిషన్ కాకతీయ పథకం వల్లే సాధ్యమైంది. ఆనవాళ్లు కోల్పోయిన గొలుసు కట్టు చెరువులకు సీఎం కేసీఆర్ పునరుజ్జీవం కల్పించారు. ఎడారిగా మారిన ఆయకట్టుకు జవసత్వాలు తీసుకొచ్చారు. నాలుగు విడుతల్లో ప్రజా ఉద్యమంగా నిర్వహించిన ‘కాకతీయ’ ఫలితాలు కండ్లెదుట కనిపిస్తున్నాయి. చెరువులన్నీ నిండుగా ఉండడంతో భూగర్భ జలాలు సైతం పెరిగాయి. నాడు నెర్రెలు బారిన ఆయకట్టు… నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నది. సుస్థిర వ్యవసాయం ఇప్పుడు సాధ్యమవుతున్నది. ఎండకాలంలో సైతం చెరువుల కింద సాగు జోరుగా సాగుతున్నది. పచ్చబడ్డ ఆయకట్టును చూసి రైతాంగం మురిసి పోతున్నది.
– నమస్తే యంత్రాంగం, ఫిబ్రవరి 21
గతంలో ఎండాకాలం వచ్చిందంటే భూమికి తడిలేక నెర్రెలుబారి కరువు పరిస్థితులు కనిపించేవి. గుక్కెడు తాగునీటి కోసం కోసుల దూరం వెళ్లాల్సి వచ్చేది. చెరువులను నమ్ముకొని వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. దేశానికి అన్నంపెట్టేది రైతే. అన్నదాత బాగుంటే దేశం బాగున్నట్టే అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేశారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మిషన్ కాకతీయ పథకం ఒకటి. ఈ కార్యక్రమంతో బహుళ ప్రయోజనాలు చేకూరాయి. సాగునీటితోపాటు తాగునీరు అందుబాటులోకి వచ్చింది. మత్స్య సంపద పెరిగింది. బీడుభూములన్నీ సాగులోకి వచ్చాయి. చెరువుల్లో నీటినిల్వ సామర్థ్యం పెరగడంతో ఆయకట్టులో రెండు పంటలకూ సాగునీరు అందుతున్నది. ఉమ్మడి జిల్లాలో రికార్డుస్థాయిలో ధాన్యం పండిస్తున్న రైతన్నకు వ్యవసాయం పండుగలా మారింది.
పిట్లం పెద్ద చెరువుకు పూర్వవైభవం
పిట్లం, ఫిబ్రవరి 21: వంద ఏండ్లనాడు తవ్విన చెరువులను ఎవరూ పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సాగునీటి వనరులను పునరుద్ధరించిన సీఎం కేసీఆర్.. రైతులకు దేవుడయ్యారు. అధ్వాన స్థితిలో ఉన్న పిట్లం పెద్దచెరువును మిషన్ కాకతీయ పథకం ద్వారా పూర్వవైభవం సంతరించుకున్నది. మండలకేంద్రంలోని 350 ఎకరాలకు సాగునీరు అందించే పెద్ద చెరువు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.06 కోట్లు మంజూరుచేసి విడుతల వారీగా అభివృద్ధి చేశారు. పూడికతీత, తూములు, పంట కాలువల మరమ్మతు, ఒక అలుగు, చెరువుకట్టను బలోపేతం చేశారు. దీంతో ఈ చెరువును ఏడాదిపాటు ఎప్పుడు చూసినా నీటితో నిండుగా కళకళలాడుతున్నది. గతంలో ఒక్కపంటకూ సాగునీరు అందేది కాదు. నేడు చెరువును పునరుద్ధరించాక నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. దీంతో రైతులు రెండు పంటలూ వరిసాగుచేస్తూ బంగారంలాంటి దిగుబడి సాధిస్తున్నారు.
30 ఏండ్ల తర్వాత ఏటా రెండు పంటలు..
భీమ్‌గల్, ఫిబ్రవరి 21 : భీమ్‌గల్ మండలం పల్లికొండ చెరువు శిఖం 114 ఎకరాలు. ఆయకట్టు సుమారు 375 ఎకరాలు. రైతులు ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు లేక 30 ఏండ్లపాటు ఒక్కపంటనే సాగుచేశారు. వంద ఎకరాలను బీడుగా ఉంచేవారు. మిషన్ కాకతీయ పథకం కింద ఈ చెరువును రూ. 46 లక్షలతో పునరుద్ధరించారు. పూడిక తీయడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి రావడంతో రెండు పంటలూ పండిస్తున్నారు. మరో వంద ఎకరాల బీడుభూములు సాగులోకి వచ్చాయి.
కమ్మరి చెరువు కళకళ
బిచ్కుంద, ఫిబ్రవరి 21 : బిచ్కుంద కమ్మరి చెరువుకు పెద్ద ఎత్తున ఆయకట్టు ఉన్నది. గతంలో ఐదు వేల ఎకరాలు సాగయ్యేది. చెరువు విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో మిషన్ కాకతీయ పథకం కింద భారీగా నిధులు కేటాయించారు. చెరువును పునరుద్ధరించడంతోపాటు కట్టపై మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటు చేశారు. చెరువులో పూడిక తీసి తూములను బలోపేతం చేయడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. దీంతో అదనంగా మరో రెండువేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. దిగుబడి కూడా భారీగా పెరిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడంతో పర్యాటక కేంద్రాన్ని తలపిస్తున్నది. సాయంత్రం వేళలో స్థానికులు ఇక్కడ సేదతీరుతూ చెరువు అందాలను వీక్షిస్తున్నారు.
రూ.10 కోట్లు.. 32 తటాకాలు..
మద్నూర్, ఫిబ్రవరి 21: మండలంలో ఆనవాళ్లు కోల్పోయిన చెరువులు ప్రత్యేక రాష్ట్రంలో జలకళ సంతరించుకున్నాయి. మిషన్ కాకతీయ కింద మొత్తం 32 చెరువులకు బీఆర్ఎస్ ప్రభుత్వం విడుతల వారీగా రూ. 10 కోట్లు మంజూరు చేసి పునరుద్ధరించింది. మొదటి విడుతలో రూ. 5.38 కోట్లతో 12 చెరువులు, రెండో విడుతలో రూ. 3.38 కోట్లతో 13 చెరువులను బాగుచేశారు. మూడో విడుత రూ. 98 లక్షలతో మూడు చెరువులు, నాల్గో విడుతలో రూ. 55 లక్షలు కేటాయించి నాలుగు చెరువులకు పూర్వవైభవం తెచ్చింది. 32 చెరువుల కింద మొత్తం 15 వందల ఎకరాల ఆయకట్టు ఉండగా, నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో రైతులు ధైర్యంగా రెండు పంటలు సాగుచేస్తున్నారు. చెరువుల చుట్టుపక్కల భూగర్భ జలమట్టం పెరిగింది. బోరుబావులు తవ్వితే తక్కువ లోతులోనే నీళ్లు పడుతున్నాయి.
30 ఏండ్లకు అలుగు పారింది..
భిక్కనూరు,ఫిబ్రవరి 21: భిక్కనూరు మండలం జంగంపల్లిలో నిజాం కాలంలో నిర్మించిన పెద్దచెరువును ఆంధ్రాపాలకులు ఏనాడూ పట్టించుకోలేదు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మిషన్ కాకతీయ పథకం కింద రెండో విడుతలో రూ. 3.65కోట్లు కేటాయించి ఈ చెరువును పునరుద్ధరించారు. దీంతోపాటు మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. 2016లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శంకుస్థాపన చేయగా, ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తయి.. చివరి దశకు చేరుకున్నాయి. చెరువులో పూడికతీసి నాలుగు తూములు, పంట కాలువలకు మరమ్మతు చేశారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో 153.05 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు.. 30 ఏండ్ల తర్వాత అలుగు పారింది. ఆయకట్టు కింద 505 ఎకరాలకూ సాగునీరు అందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వానకాలంలో ఒక్క పంటనే సాగయ్యేదని, ప్రస్తుతం రెండు పంటలూ పండిస్తున్నామని తెలిపారు.
మర్రికుంటతో మరిన్ని లాభాలు
మెండోరా, ఫిబ్రవరి 21: మండలంలోని దూదిగాం గ్రామం మర్రికుంటలో నీరు లేక ఆయకట్టు కింద ఒకే పంట పండేది. వానకాలం నీటితోనే రైతులు సరిపెట్టుకునేవారు. మిషన్ కాకతీయ పథకం కింద మొదటి విడుతలో మర్రికుంట చెరువును పునరుద్ధరించారు. చెరువులో పూడిక తీయడంతోపాటు తూములను మరమ్మతు చేశారు. నీరు వృథాగా పోకుండా చెరువు కట్టను బలోపేతం చేశారు. అప్పటి నుంచి ఈ చెరువు.. ఆయకట్టు రైతులకు మరిన్ని లాభాలు తెచ్చిపెడుతున్నది. నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో రెండు పంటలకూ సాగునీరు అందుతున్నది. ఈ చెరువు విస్తీర్ణం 23 ఎకరాలు. ఆయకట్టు కింద 42 ఎకరాల్లో సాగుచేస్తున్న పంటలకు పుష్కలంగా నీరు అందడంతో దిగుబడి కూడా రెట్టింపయ్యిందని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు.. బతుకుపై భరోసా కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఐదేండ్లలో రూ.22కోట్లను అందించింది..
మాదాపూర్ పెద్దచెరువు ఫలితం..
మాక్లూర్, ఫిబ్రవరి 21: మాక్లూర్ మండలంలోని మాదాపూర్ పెద్ద చెరువును మిషన్ కాకతీయ మొదటి దశలో రూ.83లక్షల46వేలతో పునరుద్ధరించారు. గతంలో చెరువులో నీరు సరిగా నిల్వ లేకపోవడంతో ఆయకట్టు రైతులు వంతుల వారీగా 150-200 ఎకరాలు మాత్రమే సాగు చేసేవారు. మిషన్ కాకతీయ ఫలితంగా 2016వ సంవత్సరం నుంచి ఏకకాలంలో 500 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఏటా రెండు పంటలు నిశ్చింతగా పండించుకుంటున్నారు. ఎకరానికి 30బస్తాల చొప్పున 500 ఎకరాలకు 15వేల బస్తాలను పండిస్తూ ఆరు నెలలకు రూ.2కోట్ల20లక్షల లాభాలను గడిస్తున్నారు. చెరువును పునరుద్ధరించిన తర్వాత ఐదేండ్లలో సుమారు రూ.22కోట్లను సంపాదించారు. 2016కు ముందు ఐదేండ్లలో 10కోట్లు సంపాదించే రైతులు.. రూ.22కోట్ల వరకు సంపాదించేలా మిషన్ కాకతీయ భరోసానిచ్చింది.
నీటినిల్వ సామర్థ్యం పెరిగింది..
పంటలకు సాగునీరు అందక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని తెచ్చి చెరువులను బాగుచేసింది. పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. చుట్టుపక్కల బోరుబావుల్లోకి కూడా నీరు చేరింది. రైతులకు సాగునీటి ఇబ్బందులన్నీ దూరమయ్యాయి.
భూగర్భ జలాలు పెరిగాయి..
పెద్ద చెరువును పునరుద్ధరించడంతో చుట్టు పక్కల భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో ఎండాకాలం వస్తే బోర్లు ఎత్తిపోయేవి. ఇప్పుడు బోర్ల నుంచి ఫుల్లుగా నీరు వస్తున్నది. చెరువుకింద, బోర్లు ఉన్న దగ్గర పంటలు బాగా పండుతున్నాయి. నీరు అందుబాటులో ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది.
-మెంగని బాల్‌చంద్రం, రైతు, జంగంపల్లి
నీరు వృథాకాకుండా చేశాం..
చిన్ననీటి వనరుల నుంచి నీరు ఎక్కువగా వృథా అయ్యేది. చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం విడుతల వారీగా నిధులు మంజూరు చేసింది. అన్ని గ్రామాల్లో చెరువులను అభివృద్ధి చేశారు. చెరువు కట్టలు, తూములను బలోపేతం చేసి నీరు వృథాగా పోకుండా చర్యలు చేపట్టాం. చెరువుల ద్వారా సాగునీరు వృథా పోకుండా చర్యలు చేపడుతున్నాం.
-రెహమాన్, ఇరిగేషన్ ఏఈ, పిట్లం
ఇప్పుడు ఢోకాలేదు..
చెరువు కింద మాకు మూడెకరాల భూమి ఉంది. నాకు తెలిసి యాసంగిలో ఎన్నడూ తూము నుంచి నీరు రాలేదు. కానీ మిషన్ కాకతీయ కింద చెరువుకు మరమ్మతు చేయడంతో పరిస్థితి మారింది. చెరువు నిండుగా ఉంటున్నది. ఇప్పుడు రెండు పంటలకు ఎలాంటి ఢోకా లేదు.
-రాజేశ్,రైతు, పల్లికొండ
కేసీఆర్ ఎంతో మేలు చేశారు..
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన మిషన్ కాకతీయ పథకం మాకు ఎంతో మేలు చేసింది. పెద్ద చెరువు కింద నాకు మూడు ఎకరాల పొలం ఉన్నది. గతంలో ఒక పంటకు మాత్రమే నీరందేది. వ్యవసాయం దండగా అనిపించేది. గతంలో చెరువులో నీళ్లు లేక వంతుల వారీ విధానం ఉండేది. రెండేండ్లకోసారి రెండు పంటలు పండేవి. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. ఏడాదికి రెండు పంటలు పండడంతో 200 బస్తాలకు పైగా వడ్లు విక్రయిస్తున్నాం.