డిచ్పల్లి, నవంబర్ 28 : సామాజిక పెన్షన్లు రాక లబ్ధిదారులు సతమతమవుతున్నారు. నెలాఖరు వచ్చినా పంపిణీ ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పింఛన్ల పంపిణీ మొదలు కాలేదు. మందులు, ఇంటి ఖర్చుల కోసం పెన్షన్లపైనే ఆధారపడి బతుకుతున్న ఎంతోమంది ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎలాంటి ఆదాయం లేక, కేవలం పింఛన్‌పైనే ఆధారపడి కాలం వెళ్లదీస్తున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. పింఛన్లు రెట్టింపు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా పెంపు లేదు సరికదా.. సమయానికి పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు. దీనిపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పింఛన్ల పెంపు దేవుడెరుగు.. కేసీఆర్ సారు ఇచ్చినట్లు టైముకు మాకు పింఛన్లు ఇస్తే అదే పదివేలు అని చెబుతున్నారు.
రేవంత్ సర్కారు రైతులను మోసగించినట్లే మహిళలు, వృద్ధులు, దివ్యాంగులను మోసం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందర తెగ హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వస్తే పెన్షన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. ‘ఈ నెల మీకు వచ్చేది రూ.2 వేల పెన్షనే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వచ్చే నెల నుంచి రూ.4 వేల పెన్షన్ వస్తది’ అని రేవంత్ సహా కాంగ్రెస్ నేతలంతా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. గద్దెనెక్కి ఏడాది కావస్తున్నా సీఎం సహా ఎవరూ పింఛన్ల పెంపుపై నోరెత్తడం లేదు. పెన్షన్ పెంచుడు తర్వాత సంగతి.. గతంలో కేసీఆర్ ఇచ్చినట్లు ఠంచన్‌గా నెలారంభంలోనే డబ్బులు ఇస్తే చాలని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ అధికారం చేపట్టాక సామాజిక పింఛన్లను భారీగా పెంచారు. వృద్ధులు, వితంతువు లకు గతంలో ఇస్తున్న రూ.200 పెన్షన్‌ను రెండు దఫాల్లో పెంచి రూ.2016 వేలు చేశారు. దివ్యాంగులకు రూ.4016 చొప్పున ఇచ్చి ఆసరాగా నిలబడ్డారు. అంతేకాకుండా బీడీలపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మహిళలకు సైతం రూ.2 వేల చొప్పున జీవనభృతి ఇచ్చారు. అలాగే, గీత, నేత కార్మికులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి సైతం ‘ఆసరా’గా నిలిచారు. కేసీఆర్ పాలనలో ప్రతి నెలా మొదటి వారంలోనే ఠంచన్‌గా పింఛన్లు వచ్చేవి. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఒక నెల పెన్షన్‌ను ఎగ్గొట్టిన రేవంత్ సర్కారు.. నెల ఆరంభంలోనే ఇవ్వాల్సిన పింఛన్లను నెలాఖరు వచ్చినా ఇవ్వకుండా సతాయిస్తున్నది.
నిజామాబాద్ జిల్లాలో 2.71 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 1.53 లక్షల మందికి పైగా వివిధ రకాల సామాజిక పెన్షన్లు పొందుతున్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు పెన్షన్లను నమ్ముకుని బతుకున్నారు. ప్రతినెలా ప్రభుత్వం అందించే పింఛన్లతోనే రోజులు వెళ్లదీస్తున్నారు. అయితే, నవంబర్ నెల గడిచిపోతున్నప్పటికీ రేవంత్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో పింఛన్ల పంపిణీ ప్రారంభం కాలేదు. కనీసం ఆసరా పెన్షన్లకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేక పోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.