ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించింది. ఏరు దాటే దాక ఓడ మల్లన్న… ఏరు దాటాక బోడ మల్లన్న అన్న చందంగా సర్కారు తీరు కనిపిస్తున్నది. వారి శ్రమకు తగ్గట్టుగా రూ.18వేలు వేతనం, హెల్త్‌కార్డులు ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ఎన్నికల సభల్లో పదే పదే ఊదరగొట్టారు. ఇప్పుడు గద్దెనెక్కి 19 నెలలైనా ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీల ఊసే ఎత్తడం లేదు. అటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఇటు మంత్రికి విన్నవించినా వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. ఎలాగైనా తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఉద్యమించడానికి ఆశ కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు.
ఆశ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి, వారిపై చిన్నచూపు చూస్తున్నది. కరోనా సమయంలో ఆశ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా రాత్రింబవళ్లు పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు అందించడంలో ఆశ కార్యకర్తలు ఇప్పటికీ కీలకంగా మారారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తుంటారు. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది.
ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగితే సర్కారు తమపై దాష్టీకానికి దిగుతున్నదని ఆశ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్ 9న హైదరాబాద్‌లో శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై పోలీసులతో సర్కారు దాడులు చేయించిందని వాపోతున్నారు. నేరస్తులు, అసాంఘిక శక్తుల మాదిరిగా పురుష పోలీసులు చితకబాది, వ్యాన్లలో లాగి పడేసినట్లు చెబుతున్నారు. తాము ఏం తప్పు చేశామని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడగడమే పాపమా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ వస్తే వేతనాలు పెరుగుతాయనుకున్న తమ ఆశలపై సర్కారు నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు మంత్రులు, అధికారులను అడిగినా నిధుల్లేవని సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని వేడుకుంటున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తమదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తమ హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆశ కార్యకర్తలకు సముచిత గౌరవం లభించింది.వారి సేవలను కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో వారికి వేతనం రూ.1200 మాత్రమే ఉండగా.. దానిని కూడా మూడు, నాలుగు నెలలకోసారి ఇచ్చేవారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 2017 మే నెలలో రూ.6వేలకు వేతనం పెంచారు. మళ్లీ అదే ఏడాది సెప్టెంబర్‌లో అడగకుండానే రూ.7,500 చేశారు. అంతేగాకుండా ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీ పరిధిలోకి తెచ్చారు. 2020లో పీఆర్సీకి అనుగుణంగా 30శాతం అనగా రూ.9,750 పెంచారు. క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలను ఖాతాల్లో జమ చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి నుంచి మూడు నెలల పాటు వేతనాలు నిలిపి వేశారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆందోళనకు దిగితే రెండు, మూడు నెలలు సక్రమంగా ఇచ్చి తిరిగి ఆపివేశారని చెబుతున్నారు. పెద్ద ఎత్తున ధర్నా, నిరసనలకు ఉపక్రమించిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఆశ కార్యకర్తలు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ హయాంలో తమ సేవలను గుర్తించడం లేదని వాపోతున్నారు. గతంలో ప్రతినెలా తమ సమస్యలపై మంత్రి, అధికారులు సమీక్ష నిర్వహించేవారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో అడుగడుగునా ఆశ కార్యకర్తలకు గౌరవం దక్కింది. సముచిత స్థానం లభించింది. వారి శ్రమను కేసీఆర్ గుర్తించి, వేతనాలను పెంచి ఆశ కుటుంబాలకు అండగా నిలిచి ఆదుకున్నారు.
కోటగిరి, జూలై 7: గర్భిణులకు డెలివరీ సమయంలో ఎంతో కష్టపడుతున్నాం. పగలు, రాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నాం. కానీ మా కష్టానికి తగిన వేతనాలు ఇస్తలేరు. ప్రస్తుతం నెలకు రూ.9,750 ఇస్తున్నారు.. అవి ఏ మాత్రం సరిపోత లేదు. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు మాత్రం పెరిగాయి. కానీ మా జీతాలు మాత్రం పెరగడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీ ప్రకారం వేతనం నెలకు రూ.18వేలు ఇవ్వాలి.
నేను 17 ఏండ్ల నుంచి ఆశ కార్యకర్తగా పని చేస్తున్న. పగలు, రాత్రనక ఎంతో కష్టపడుతున్నాం. కానీ జీతాలు మాత్రం పెంచడం లేదు. జీతాలు పెంచాలని ఏడాది నుంచి అడుగుతున్నా మా గోడును పట్టించుకునే వారే కరువయ్యారు. ఎన్నిసార్లు అడిగినా మాకు జీతాలు పెంచడం లేదు. సరుకులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ జీతాలు మాత్రం పెంచడం లేదు.
పెరిగిన ధరలకు అనుగణంగా మాకు కూడా జీతాలు పెంచాలి. ప్రస్తుతం ఇచ్చే జీతాలు సరిపోత లేవు. మా కష్టాన్ని గుర్తించి నెలకు రూ.18వేల జీతం ఇవ్వాలి. గతేడాది నుంచి జీతాలు పెంచాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా వేతనాలు పెంచి ఇవ్వాలని కోరుతున్నాం.