మోర్తాడ్, మార్చి 20: కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్ధికశాఖ మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్.. పేదలను, మహిళలను, నిరుద్యోగులను పూర్తిగా వంచించేలా ఉన్నదని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. గతేడాది బడ్జెట్ అంచనాలను అందుకోలేక పూర్తిగా విఫలమైన ఈ ప్రభుత్వం.. అయినా కూడా మళ్లీ అదే విధంగా అంకెల మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా.. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుకు బడ్జెట్లో ఎలాంటి స్పష్టత, కేటాయింపులు లేవని విమర్శించారు. ప్రజలకు పనికొచ్చే పథకాలకు కేటాయింపులు లేవు కానీ, స్కామ్‌లు చేసే ప్రాజెక్టులకు కేటాయింపులు చేశారన్నారు. 1.58 కోట్ల మంది మహిళలకు ఇస్తానన్న రూ.2500 చేయూత పథకం గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని వేముల ధ్వజమెత్తారు. సామాజిక పింఛన్లను రూ.4వేల పెంచుతామన్న కాంగ్రెస్.. ఆ మేరకు కేటాయింపులు చేయలేదు.
తులం బంగారం హామీని పూర్తిగా మర్చిపోయిందని విమర్శించారు. జాబ్‌క్యాలెండర్‌ను విస్మరించారని, రుణమాఫీపై స్పష్టత లేదన్నారు. ఆచరణ సాధ్యం కానీ రాజీవ్ యువ వికాసానికి మాత్రం ప్రతిసారి బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ వస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో ఈ బడ్జెట్ వాస్తవికతకు దూరంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వానికి భూములపై ఉన్న ప్రేమ ప్రజలకు ఇచ్చిన హామీలపై లేదన్నది తేలతెల్లమైందన్నారు.