హైదరాబాద్ : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)కు కమిషనర్ లేక రాష్ట్రంలోని 184 ఎంసీహెచ్, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీ ఆసుపత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి హరీష్‌రావు ( Harish Rao ) ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన గైనకాలజీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, పీడియాట్రిక్ తదితర ప్రత్యేక వైద్య సేవలను అందించే విభాగాలు నిర్వీర్యమవుతున్నాయని ఆరోపించారు. సంబంధిత ఉద్యోగ సంఘాల నాయకులు హరీష్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు.
వైద్య విధాన పరిషత్‌లో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ గత రెండు నెలలుగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో ఆసుపత్రుల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వైద్యుల హాజరు, ల్యాబ్ పరీక్షలు, మందుల లభ్యత తదితర అంశాలను పర్యవేక్షించే అధికార యంత్రాంగమే లేకుండా పోయిందని పేర్కొన్నారు.
వైద్య సిబ్బంది వేతనాలు, సర్వీస్ సమస్యలు సహా ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. దాదాపు మూడేళ్లు గడుస్తున్నా, సర్వీసు నిబంధనలు రూపొందించక పోవడం, లక్ష్యం కార్యరూపం దాల్చక పోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కు సంబంధించి వెంటనే కమిటీ వేసి సర్వీస్ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని, తక్షణమే పూర్తిస్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.