ఖలీల్‌వాడి, జూన్ 9: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ తోడు దొంగల్లా మారి తెలంగాణ రైతాంగం నడ్డి విరుస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కనెక్షన్లు, మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లను కలిపి ‘రైతు డిస్కం’ పేరిట ఒక ప్రత్యేక డిస్కంను ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో నిధులు ఉంటేనే కరెంట్ లేకపోతే లేదనే పరిస్థితి తీసుకొచ్చి రైతులను బిచ్చగాళ్లుగా మార్చే ప్రమాదముందని హెచ్చరించారు.
డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో మంగళవారం రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సభ్యత్వ నమో దు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వేములతోపాటు సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, పార్టీ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్, సభ్యత్వ నమోదు ఇన్చార్జి గంగారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యాప్ పోవాలే.. కేసీఆర్ బాపు రావా లే అని ప్రజలందరూ అంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు ఒక్క ఫోన్ కాల్‌తో తమకు కావాల్సిన యూరియా బస్తాలను నేరుగా పొలాల వద్దకే ఆటోల్లో తెప్పించుకునే సులభతరమైన సౌకర్యం ఉండేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌తో రైతు లు యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాప్‌తో ఒక రైతుకు కేవలం నాలుగు బస్తాల కన్నా ఎక్కువ యూరియా లభించడం లేదని, ఐదెకరాల రైతుకు 20 బస్తాల యూరియా కావాలంటే నాలుగు ప్రాంతాలకు తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే ఈ యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు కనురెప్ప వేసినంత సేపు కూడా కరెంట్ పోకుండా నిరంతరాయంగా నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ లభించేదని, మోటార్లు కాలిపోయే సమస్యే ఉండేది కాదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సరఫరా కేవలం 6-11 గంటలకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలని కాంగ్రెస్ నేత కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేముల ఆగ్రహం వ్యక్తంచేశారు. 3గంటల కరెంట్ ఇస్తే పొలంలోని చివరి మడికి కూడా నీరందదని మూ డు గంటల కరెంట్‌తో వ్యవసాయం సాధ్యమని భావిస్తే సీఎం రేవంత్‌రెడ్డి, కోదండరెడ్డి స్వయంగా ఇక్కడికి వచ్చి ఆ మూడు గంటల కరెంట్‌తో పొ లాలు పారించి చూపించాలని సవాల్ విసిరారు.
పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల అప్పులు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నరేండ్లలోనే రూ.4లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఆ డబ్బులన్నీ ఎటు పోతున్నాయో సమాధానం చెప్పాలని వేముల డిమాండ్ చేశారు. పేదల ఇండ్లను కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రా పని చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా కూల్చివేతలను హిట్లర్ నియంత పాలనతో ఇరాన్, ఇరాక్ యుద్ధంతో పోల్చుతున్నారని మండిపడ్డారు. హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని, చరిత్ర ఆయనను క్షమించదని హెచ్చరించారు. తెలంగాణ అస్తిత్వం మళ్లీ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసు అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
సన్నాహక సమావేశంలో రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా వేముల సమక్షంలో రెండుముఖ్యమైన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రస్తుత యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి అన్ని సొసైటీల ద్వారా రైతులకు నేరుగా యూరియా అందే లా చర్యలు చేపట్టాలని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన విధంగానే, నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని తీర్మానించారు. నాయకులు సాంబారి మోహన్, సుమనా రెడ్డి మంజుల, కార్యకర్తలు పాల్గొన్నారు
రూరల్ నియోజకవర్గంలోఅధికార పార్టీ నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరితమైన మాటలు నమ్మి రైతులు నరకయాతన పడుతున్నారు. ఒకసారి చేసిన తప్పునకు ప్రజలు బాధపడుతున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రూరల్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగింది. వంద ట్రాక్టర్లను ఉచితంగా అందించాం. కేసీఆర్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి ద్వారా రూ.లక్షా 116 ఇస్తే, లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి, ఇప్పుడు బడ్జెట్ లేదని చెబుతున్నది. కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లపేరుతో ఇసుక, మొరం దోపిడీ చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు చేస్తే తప్పులేదు. కానీ ఇతర వ్యక్తులు చేస్తే వారిని పట్టుకొని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు. అధికార పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. రైతుల గోస పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతులకు ఉచిత కరెంట్, రైతుబంధు ఇచ్చి ఆదుకున్న దేవుడు కేసీఆర్. రాక్షసుడులా వచ్చి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు రేవంత్‌రెడ్డి.
బండి సంజయ్ కొడుకు లైంగికవేధింపులకు పాల్పడితే కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, అదే నిరుపేదలు చేస్తే ఎన్కౌంటర్ చేస్తారా.? నిజామాబాద్ జిల్లాకు జక్రాన్‌పల్లి ఎయిర్పోర్ట్ అవసరంలేదని చెప్పిన ఘనులు ఈ కాంగ్రెస్ నాయకులు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటిలేదు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయాలి. మహిళలకు రూ. 2500, యువతులకు స్కూటీలు, పింఛన్ పెంపు వంటి హామీలు ఇచ్చి, ఇప్పటివరకూ అమలుచేయని రేవంత్‌రెడ్డి తన పేరును అబద్ధాల రేవంత్‌రెడ్డిగా మార్చుకోవాలి. రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లు పలికే ఆర్టీసీకి సంబంధించిన భూమిని కబ్జా చేసిన దగాకోరు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెడితే ఊరుకునేది లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ సాధించుకునే వరకు పోరాటాలు చేసింది బీఆర్ఎస్. మనకు కేసీఆర్ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదేనా?.. 14 సంవత్సరాల సుదీర్గ పోరాటం, అమరుల త్యాగం వల్లే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఎవరి జాగీరు కాదు. తెలంగాణ ప్రజల జాగీరు. తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడు కేసీఆర్. పదేండ్ల కాలంలో తెలంగాణను సుందరంగా తీర్చిదిద్దితే, కాంగ్రెస్ నాయకులు భ్రష్టుపట్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకుంటలేదు. వడ్లను కొనుగోలు చేయడంలేదు.
రాబోయే రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అన్ని సర్వేలు బీఆర్ఎస్ వైపే చూపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ పాలిట శనిలా మారాడు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక నిందలు వేస్తున్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఎప్పుడు అమలుచేస్తారు. కేసీఆర్ ప్రజల మంచిని కోరుకున్నాడు. తెలంగాణ కోసం మంచి చేసిన వారికి ఆ భగవంతుడు మంచి చేస్తాడు.
బీఆర్ఎస్ చాలా బలమైన పార్టీ. కేసీఆర్ తెలంగాణను సాధించి దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంచారు. పార్టీ కార్యకర్తలు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు .. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విచిత్రంగా ఉన్నారు. అధికారంలోకి రావాలని అనేక హామీలు ఇచ్చి, వాటిని అమలుచేయకుండా తప్పించుకుంటున్నారు. అన్ని కులాల కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా చోద్యం చూస్తున్నారు. ఆంధ్ర నాయకులకు దానధర్మాలు చేస్తున్నారు. దమ్ముంటే ఆరు గ్యారెంటీలు అమలుచేయాలి. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వాలి.
బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త బొబ్బిలిపులి. పార్టీకి కార్యకర్తలే బలం. గ్రామగ్రామాన సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలి. తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్ ఎంతో పోరాడింది. కేసీఆర్ లేకుంటే అసలు తెలంగాణ ఉండేదేనా? కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలి. ప్రతి ఒక్కరూ ఒక కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అనుకొని గ్రామగ్రామనా సభ్యత్వ నమోదు చేయించాలి. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమే. గ్రామాల్లో ప్రతి కార్యకర్త పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్కో కార్యకర్త శక్తిగా తయారుకావాలి. ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డులు వస్తాయి. ఈసారి 80 వేలకు తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత రూరల్ నియజకవర్గ ప్రజలదే.
రేవంత్‌రెడ్డికి రెబిస్ వ్యాధి సోకింది. కారు స్పీడ్ పెరిగింది. 300 స్పీడ్‌తో చేతులు లేకుండా చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పని ముగిసినట్లే. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆర్మూర్‌లో పైసలరెడ్డి, బాల్కొండలో ఇసుకరెడ్డి, రూరల్‌లో ఇటుక రెడ్డి రాజ్యమేలుతున్నారు. పోలీసుల ఓవరాక్షన్ అపకుంటే పింక్ బుక్‌లో ఎక్కిస్తాం. ఎంపీ అర్విం ద్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రజలకు ఏం చేస్తున్నారు. వడ్ల గింజ కొనుగోలు చేయనివారు నాయకులు ఎలా అవుతారు. తెలంగాణ అంటేనే కేసీఆర్. తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చాడు. ఆయనతో రేవంత్‌రెడ్డికి పోలికనా.. చంద్రబాబు శిష్యుడవు. తెలంగాణ ఉద్యమ సమయంలో లేని వ్యక్తులు రాష్ట్రంలో ఎందుకు అడుగుపెడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటే. రూ. లక్షల కోట్లు వృథా చేస్తూ, హైడ్రా పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రైతుబంధు ఇవ్వకుండా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు.
రాష్ట్రంలో సామాజిక న్యాయం చేసింది ఒక్క కేసీఆర్ మాత్రమే. పదేండ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారు. నిరుపేదలైన దళితులను దళితబంధుతో ఆదుకున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం బీసీలను మోసం చేసింది. దళితులకు కేసీఆర్ ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇస్తే, కాంగ్రెస్‌పార్టీ రూ. 12 లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేసింది. సిగ్గు లేకుండా ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కుతున్నారు. పోడు భూములకు పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? తొమ్మిది మల్టీలెవల్ దవాఖానలను తీసుకువస్తానని చెప్పి ఒక్క దవాఖాన కూడా తీసుకురాలేదు. ఐటీడీఏ ఏర్పాటు చేస్తానని చెప్పి వంచించారు.