వర్ని, ఆగస్టు 15: కులవృత్తులపై ఆధారపడిన నిరుపేదలను ఆదుకునేందుకే సీఎం కేసీఆర్ బీసీబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టి సాధించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలోని సీసీడీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్ని, రుద్రూర్, కోటగిరి, పొతంగల్, చందూర్, మోస్రా మండలాలకు చెందిన 175 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరు మండలాలకు చెందిన 1745 మందిని ఈ పథకం కింద ఎంపిక చేశామని, తొలి విడుతగా 175మందికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు వివరించారు. ఈ పథకం నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రతి నెలా కొందరికి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు.
గత ప్రభుత్వాలు ఇచ్చే 20శాతం సబ్సిడీ, 80శాతం బ్యాంకు రుణాల కోసం లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరకు పెట్టుకున్న వ్యాపారాలు ఎత్తివేసి రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎలాంటి వడ్డీ, బ్యాంకు లింకేజీ లేకుండా ఏకంగా లక్ష రూపాయలు పూర్తి ఉచితంగా లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్లు వెల్లడించారు. కులవృత్తులపై ఆధారపడిన వారిని ఆదుకునేందుకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. ప్రతి నిరుపేదకు గూడు కల్పించాలనే లక్ష్యంతో గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బోధన్ ఆర్డీవో రాజాగౌడ్, ఎంపీపీలు మేక శ్రీలక్ష్మీవీర్రాజు, అక్కపల్లి సుజాతానాగేందర్, లావణ్యారాంరెడ్డి, పిట్ల ఉమాశ్రీరాములు, జడ్పీటీసీ సభ్యులు బర్దావల్ హరిదాస్, నారోజి గంగారాం, ఏఎంసీ చైర్మన్ మూడ్ కవితాఅంబర్సింగ్, వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, బీఆర్ఎస్ నాయకులు కల్లాలి గిరి, పత్తి లక్ష్మణ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.