జాతీయ రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. మద్నూర్ మండలం మేనూర్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ఆటో.. ఎదురుగా వస్తున్న లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. అయితే ప్రమాదానికి గురైన ఆటో చోరీకి గురైందని రుద్రూర్ ఠాణాలో అంతకుముందే కేసు నమోదు కావడం గమనార్హం. ఇక, బాల్కొండ వద్ద రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. మేనూర్ దుర్ఘటనపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బాన్సువాడ దవాఖానలో మృతదేహాలను పరిశీలించి, బాధిత కుటుంబాలను ఓదార్చారు.
మద్నూర్/బాల్కొండ, జూలై 18 : రాంగ్ రూట్ ప్రయాణం ఐదుగురిని బలి తీసుకున్నది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కంటైనర్, ఆటో ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురి మృతదేహాలను పోలీసులు గుర్తించగా, మరొకరి వివరాలు తెలియాల్సిఉంది. సంఘటనకు సం బంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న కంటైనర్, మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటోపైకి లారీ ఎక్కడంతో నుజ్జునుజ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహాలను బయటికి తీయడానికి పోలీసులు క్రేన్లను ఉపయోగించారు. మృతుల్లో మద్నూర్ మం డలంలోని మేనూర్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి కృష్ణ (16), మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా, బిలోలి తాలుకా పరిధిలో గల బామని గ్రామానికి చెందిన మహజన్ భుజంగ్ (50), ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన లింబన్న, రుద్రూర్ మండలం సులేమాన్ఫారానికి చెందిన షేక్ ముజీబ్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ దవాఖానకు తరలించారు.
ఆటో రాంగ్రూట్లో రావడంతోనే ప్రమాదం
ఆటో రాంగ్ రూట్లో రావడంతోనే ప్రమాదం జరిగిందని ప్ర త్యక్షసాక్షులు తెలిపారు. మద్నూర్ నుంచి వస్తున్న సమయం లో సర్వీస్ రోడ్డు దాటగానే ఆటో రాంగ్రూట్లో వచ్చిందని, ఎదురుగా వేగంతో వస్తున్న లారీ ఢీకొనడంతో ఘోర ప్రమా దం జరిగిందని తెలిపారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే అక్కడికి వచ్చిన డీఎస్పీ జైపాల్‌రెడ్డికి ఘటనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ఎస్పీ పూర్తిగా పరిశీలించారు. సీఐ కృష్ణ, ఎస్సైలు శివకుమార్, శ్రీధర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, విజయ్, తహసీల్దార్ అనిల్, ఆర్ఐ శంకర్ ఉన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బాన్సువాడ ఏరియా దవాఖానకు చేరుకుని మృతదేహాలను పరిశీలించా రు. అనంతరం ఘటన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
కాలేజీకి వెళ్లిన మొదటి రోజే కానరాని లోకాలకు..
మేనూర్ గ్రామానికి చెందిన కృష్ణ ఇటీవల పదో తరగతి పాసయ్యాడు. మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈ రోజే కాలేజీకి వెళ్లి మృత్యువాత పడడంతో తల్లి దండ్రులు బోరున విలపించారు. కుమారుడు ఉన్నత చదువులు చదివి తమను పోషిస్తాడునుకుంటే తిరిగిరాని లోకానికి వెళ్లాడంటూ తల్లి రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
ప్రమాదంపై స్పీకర్ పోచారం, మంత్రి వేముల దిగ్భ్రాంతి
బీర్కూర్/కామారెడ్డి, జూలై 18 : మెనూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు వేర్వేరుగా పత్రికా ప్రకటనలను విడుదల చేశారు. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు.
ఆటో చోరీకి గురైందని ఉదయమే స్టేషన్ ఫిర్యాదు..
రుద్రూర్, జూలై 18 : మేనూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ట్విస్టు చోటు చేసుకున్నది. ప్రమాదం సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా ఈ రోజు ఉదయమే నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పోలీసు స్టేషన్లో ఆటో పోయిందని ఫిర్యాదు అందింది. హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్‌కు చెందిన ముజీబ్ అనే వ్యక్తి బోధన్ ప్రాంతంలో ఆటోను అపహరించి బిలోలి మీదుగా హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని ఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.