యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ కుయుక్తులకు తెరలేపింది. గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నాలు చేసింది. బీఆర్ఎస్ అడ్డుకోవడంతో భువనగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ మున్సిపాలిటీలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ రాలేదు. నలుగురు స్వతంత్రులు గెలవడంతో అందులో ఓ అభ్యర్థి బీఆర్ఎస్కు మద్దతు తెలిపేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాల నేపథ్యంలో చిక్కకుండా జనగామ నుంచి హైదరాబాద్‌కు బస్సులో బయలుదేరారు.
ముందే పసిగిట్టిన భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు భువనగిరి శివారులోని ఓ హోటల్ దగ్గర కాపు కాశారు. అక్కడికి బస్సు రాగానే ఆపి.. అభ్యర్థిని దింపి, అక్కడే ఉన్న హోటల్లోకి తీసుకెళ్లి నిర్బంధించారు. తాను బీఆర్ఎస్కే మద్దతు ఇస్తానని అభ్యర్థి చెబుతున్నా వినకుండా లోపలే బంధించారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైతం అక్కడికి చేరుకున్నారు. పదవుల ఆశ, ప్రలోభాలు ఎర చూపినా లొంగలేదు. ఈ విషయం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి తెలియడంతో ఆగమేఘాలపై హోటల్‌కు చేరుకున్నారు. హోటల్ రూమ్ తలుపును తెరిచేందుకు స్వయంగా రాజేశ్వర్‌రెడ్డి ప్రయత్నించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరాయి. సమాచారం అందుకున్న డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ అక్కడికి వచ్చారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏం జరుగుతుందోననే టెన్షన్ వాతావరం ఏర్పడింది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి యాదాద్రి ఎస్పీ అక్షాంశ్ యాదవ్‌తో ఫోన్లో మాట్లాడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గెలిచిన అభ్యర్థి ఇష్టప్రకారం వెళ్లొచ్చని పోలీసులు సూచించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెంట వచ్చేందుకు అభ్యర్థి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించేందుకు యత్నించాయి. చివరకు అభ్యర్థిని తీసుకొని పల్లా తన కారులో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.