టీ20 ప్రపంచకప్‌లో సంచలనం! ఫార్మాట్ ఏదైనా తమకు ఎదురేలేదని విర్రవీగే ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లున్న ఆసీస్‌ను ఓడించి ఈ టోర్నీలో తొలి సంచలనాన్ని నమోదుచేసింది. బ్యాట్‌తో మెరుగ్గా ఆడటమే గాక బంతితో ప్రత్యర్థిని బెంబేలెత్తించి గ్రూప్-బీలో సూపర్-8 రేసును రసవత్తరంగా మార్చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో పునర్వైభవం దిశగా అడుగులేస్తున్న జింబాబ్వే సమష్టి పోరాటం ముందు కంగారూలు తోక ముడవక తప్పలేదు. అప్పుడెప్పుడో 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌కు షాకిచ్చిన ఆఫ్రికా జట్టు.. 19 ఏండ్ల తర్వాత ఆడి మళ్లీ అదే ఫీట్‌ను రిపీట్ చేయడం కంగారూలకు మింగుడుపడనిదే!
కొలంబో : సమష్టిగా పోరాడితే ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా చిత్తుగా ఓడించగలమని జింబాబ్వే మరోసారి రుజువుచేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టు తొలి సంచలనాన్ని నమోదుచేసింది. కొలంబో వేదికగా శుక్రవారం జరిగిన రసవత్తర పోరులో జింబాబ్వే.. 23 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. బ్యాట్‌తో పాటు బంతితోనూ సమష్టిగా రాణించి టోర్నీలో కంగారూలకు పరాభవాన్ని పరిచయం చేసింది. ఆ జట్టు నిర్దేశించిన 170 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనలో ఆసీస్.. బ్లెస్సింగ్ ముజార్బనీ (4/17) కెరీర్ అత్యుత్తమ ప్రదర్శనకు తోడు బ్రాడ్ ఎవాన్స్ (3/23) స్ఫూర్తిదాయక బౌలింగ్‌తో 19.3 ఓవర్లలో 146 రన్స్‌కే కుప్పకూలింది. మాథ్యూ రెన్షా (44 బంతుల్లో 65, 5 ఫోర్లు, 1 సిక్స్), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (32 బంతుల్లో 31, 1 ఫోర్, 1 సిక్స్), ట్రావిస్ హెడ్ (17) మినహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. ముజార్బనీకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. వరుసగా రెండు విజయాలతో గ్రూప్-బీలో రెండో స్థానంతో ఉన్న జింబాబ్వే.. సూపర్-8 దశకు మరింత చేరువవగా ఆసీస్ మూడో స్థానంలో ఉండటం గమనార్హం.
ఆసీస్ బౌలర్లు ఇన్నింగ్స్ అంతా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టడానికే తంటాలు పడ్డ పిచ్‌పై జింబాబ్వే బౌలర్లు మొదటి 4 ఓవర్లలోనే ప్రత్యర్థి టాపార్డర్‌ను పెవిలియన్‌కు పంపారు. సిక్సర్‌తో ఛేదనను ఆరంభించిన ఇంగ్లిస్ (8).. ముజర్బానీ రెండో ఓవర్లో బంతిని పుల్ చేయబోయి తషింగకు క్యాచ్ ఇచ్చాడు. ఎవాన్స్ మూడో ఓవర్లో గ్రీన్.. కీపర్ మరుమని చేతికి చిక్కాడు. నాలుగో స్థానంలో వచ్చిన టిమ్ డేవిడ్‌ను ముజార్బనీ మళ్లీ షాట్‌పిచ్ బంతితో బోల్తా కొట్టించాడు. ఎవాన్ ఐదో ఓవర్లో కెప్టెన్ హెడ్.. దురదృష్టవశాత్తూ వికెట్ల మీదకు ఆడుకుని క్లీన్‌బౌల్డ్ అవడంతో ఆ జట్టు 29/4తో నిలిచింది. ఈ క్రమంలో రెన్షా, మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌ను గట్టెక్కించారు. భారీ షాట్లేమీ ఆడకపోయినా ఈ ద్వయం నిలకడగా ఆడటంతో 13.3 ఓవర్లలో కంగారూలు వంద పరుగుల మార్కును చేరుకున్నారు. కానీ 15వ ఓవర్లో బంతినందుకున్న బర్ల్.. మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్ చేసి జింబాబ్వేను మళ్లీ పోటీలోకి తెచ్చాడు. ఆ మరుసటి ఓవర్లో మసకద్జ.. స్టోయినిస్ (6)ను ఔట్ చేసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. రెండో స్పెల్‌కు వచ్చిన ఎవాన్స్ 18వ ఓవర్లో డ్వార్షియష్ (6) ఇచ్చిన క్యాచ్‌ను మిడ్‌వికెట్ వద్ద మన్యొంగ ముందుకు డైవ్ చేస్తూ అదిరిపోయే క్యాచ్ పట్టడంతో హెడ్ సేన ఏడో వికెట్ కోల్పోయింది. ఆఖరి 2 ఓవర్లలో విజయానికి 34 రన్స్ అవసరమవగా క్రీజులో కుదురుకున్న రెన్షా ఉండటంతో ఆసీస్ ధీమాగానే ఉంది. కానీ 19వ ఓవర్లో ముజార్బనీ.. రెన్షాతో పాటు జంపా (2)నూ బౌల్డ్ చేసి జింబాబ్వే విజయాన్ని ఖాయం చేశాడు. చివరి ఓవర్లో ఎవాన్స్.. కుహ్నెమన్‌ను రనౌట్ చేయడంతో ఆసీస్ ఓటమి ఖరారైంది.
మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిలకడగా ఆడింది. భారీ మెరుపులేమీ లేకపోయినా ఆ జట్టు ఓపెనర్లు బెన్నెట్, మరుమణి తొలి వికెట్‌కు 61 రన్స్ జోడించారు. ఆసీస్ బౌలర్లు పరుగులను కట్టడి చేసినా వికెట్లు తీయడంలో సఫలం కాలేకపోయారు. మరుమణి స్థానంలో వచ్చిన బర్ల్ (35) ఫర్వాలేదనిపించినా ఆఖర్లో కెప్టెన్ సికిందర్ రజా (13 బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో ఆ జట్టు పోరాడగలిగే స్కోరును చేయగల్గింది.
100% పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై వంద శాతం రికార్డు (ఆడిన రెండు మ్యాచ్‌ల్లో) కల్గిన జట్టు జింబాబ్వే మాత్రమే.
2 టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌పై జింబాబ్వేకు ఇది రెండో విజయం. 2007 టోర్నీలోనూ ఆ జట్టు కంగారూలకు షాకిచ్చింది.
జింబాబ్వే : 20 ఓవర్లకు 169/2 (బెన్నెట్ 64* బర్ల్ 35, గ్రీన్ 1/6, స్టోయినిస్ 1/17);
ఆస్ట్రేలియా :19.3 ఓవర్లకు 143 ఆలౌట్ (రెన్షా 65, మ్యాక్స్‌వెల్ 31, బ్లెస్సింగ్ 4/17, ఎవాన్స్ 3/23)