ఎల్లారెడ్డి రూరల్/ నాగిరెడ్డిపేట, డిసెంబర్ 22 : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం ఎల్లారెడ్డిలోని పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా..వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ..రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అరెస్టులు, జైలుకు పంపించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని ఎద్దేవా చేశారు. నియోజక వర్గంలో ఇప్పటివరకు ఎలాంటి కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టిందిలేదన్నారు. ఎల్లారెడ్డిని ఐటీ కారిడార్‌గా మార్చేస్తానన్న ఎమ్మెల్యే, ఇప్పటివరకు ఒక్క ఐటీ కంపెనీని ప్రారంభించింది లేదన్నారు. ఎమ్మెల్యే చేతలకు కాకుండా కేవలం మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ నాగిరెడ్డిపేట మండల అధ్యక్షుడు గుర్నాల కిష్టయ్య ఆధ్వర్యంలో వాడి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 50 మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో లింగంపేట మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, నాయకులు అరవింద్‌గౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.